క్రీడాస్ఫూర్తిని నింపిన రన్
- 4వేల మంది హాజరు
- కిక్కిరిసిన కైకలూరు రహదారులు
- రన్‌లో పాల్గొన్న ఎంపీ మాగంటి
కైకలూరు :అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం సందర్భంగా కైకలూరులో సోమవారం నిర్వహించిన ఒలింపిక్ రన్ క్రీడా స్ఫూర్తిని నింపింది. జిల్లా క్రీడాధికార సంస్థ, ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ రన్‌లో పలు విద్యాసంస్థలకు చెందిన సుమారు 4వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఉదయం డిగ్రీ కాలేజీకి చెందిన ఒక బ్యాచ్‌ను ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు), ఏలూరురోడ్డు వద్ద మరో బ్యాచ్‌ను మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ ప్రారంభించారు.
రెండు బ్యాచ్‌ల్లోని నాయకులు, విద్యార్థులు కాగడాలతో తాలూకా సెంటర్ వద్ద ఏర్పాటుచేసిన సభా వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాగంటి మాట్లాడుతూ చదువుతో పాటు విద్యార్థులు క్రీడలపై ఆసక్తి చూపాలని పిలుపునిచ్చారు. జిల్లా క్రీడాధికారి రామకృష్ణ మాట్లాడుతూ కైకలూరులో స్టేడియం నిర్మాణానికి రూ.2.10 కోట్ల నిధులు మంజూరయ్యూయని చెప్పారు. స్థల సేకరణ జరిగితే పనులు ప్రారంభిస్తామన్నారు.
జయమంగళ వెంకటరమణ మాట్లాడుతూ క్రీడలు మానసికోల్లాసానికి ప్రతీకలన్నారు. మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు మాట్లాడుతూ కైకలూరు నుంచి వడ్లమన్నాటి పాండురంగారావు, మండవల్లి నుంచి మార్తమ్మ వంటి వారు జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ చూపారని, వారిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కేపీ రావు మాట్లాడుతూ 2018లో నిర్వహించే ఒలింపిక్ గేమ్స్‌ను మన రాష్ట్రంలో నిర్వహించాలంటూ బిడ్ వేయనున్నట్లు చెప్పారు.
కైకలూరులో రాష్ట్రస్థాయి పోటీలు త్వరలో నిర్వహిస్తామన్నారు. స్థానిక ఒలింపిక్ నిర్వహణ కమిటీ సభ్యుడు కేవీఎన్‌ఎం నాయుడు మాట్లాడుతూ కైకలూరులో ఎంతోమంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారన్నారు. కైకలూరు కరాటే మాస్టర్ ఉదయభాస్కర్ ఆధ్వర్యంలో రన్‌లో పాల్గొన్నవారికి తాగునీరు, బిస్కెట్లు, ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఒలింపిక్ రన్ నిర్వహణ కమిటీ సభ్యులు గురజాడ ఉదయశంకర్, ఎంఏ రహీమ్, పీఈటీలు లూయిస్, లక్ష్మణరావు, శ్రీనివాసరావు, పీడీ సత్యనారాయణ, సర్పంచి నర్సిపల్లి అప్పారావు, జెడ్పీటీసీ బొమ్మనబోయిన విజయలక్ష్మి, నాయకులు చలమలశెట్టి రామానుజయ్య, మార్కెట్‌యార్డు చైర్మన్ సామర్ల శివకృష్ణ, న్యాయవాది కారి శరత్‌బాబు, సయ్యపురాజు గుర్రాజు, నేషనల్, జాగృతి, భాష్యం, చైతన్య, హోలిక్రాస్, కేపీఎస్, భుజబలపట్నం, కానుకొల్లు, కైకలూరు ప్రభుత్వ బాలుర, బాలికల హైస్కూళ్లు, ఓరియంటల్ హైస్కూల్, వికాస్, విద్యాంజలి కాలేజీలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.