కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి చిరంజీవికి తూర్పుగోదావరి జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది.
సాక్షి నెట్‌వర్క్ : కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి చిరంజీవికి తూర్పుగోదావరి జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. భారీ వర్షాలవల్ల నష్టపోయిన రైతులు, ప్రజలను పరామర్శించేందుకు సోమవారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన చిరంజీవిని అడుగడుగునా సమైక్యవాదులు అడ్డుకున్నారు. తిమ్మాపురం, సర్పవరం, కొవ్వాడలలో బాధితులను పరామర్శించే సమయంలో సమైక్యవాదుల నుంచి తీవ్ర నిరసనలు ఎదుర్కొన్నారు.
చిరంజీవిని జై సమైక్యాంధ్ర నినాదాలు చేయమని పట్టుబట్టినప్పటికీ నవ్వుతూ వెళ్లిపోయారు. సర్పవరంలో అయితే చిరంజీవి కాన్వాయ్‌ను చుట్టుముట్టి సమైక ్యనినాదాలు చేశారు. కారు నుంచి దిగిన చిరంజీవిని చూసి మరింతగా నినాదాలు చేయడంతో పరిస్థితిని గమనించిన పోలీసులు వెంటనే ఆయన్ను అక్కడ నుంచి పంపించివేశారు.
ఇక, ప్రకాశం జిల్లాలో స్వయంగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమక్షంలోనే కేంద్రమంత్రి పనబాకలక్ష్మికి వ్యతిరేకంగా సమైక్యవాదులు నినాదాలు హోరెత్తించారు. ముంపు బాధితులను పరామర్శించేందుకు చీరాల సాయికాలనీలో సీఎంతో పాటు ఆమె కూడా వచ్చారు. ఆ సందర్భంలో సీమాంధ్ర ద్రోహి పనబాక డౌన్..డౌన్... అంటూ ఆందోళనకారులు పెద్దపెట్టున నినాదాలు చేశారు.