మకర సంక్రమణ బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ కార్యక్రమంతో శ్రీశైలాయం సంక్రాంతి శోభను సంతరించుకుంది.
శ్రీశైలం, న్యూస్‌లైన్: మకర సంక్రమణ బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ కార్యక్రమంతో శ్రీశైలాయం సంక్రాంతి శోభను సంతరించుకుంది. ఆదివారం పంచాహ్నిక దీక్షతో ఆరంభమైన ఉత్సవాల్లో భాగంగా ఉదయం 9.15 గంటలకు దేవస్థానం ఈవో చంద్రశేఖర్‌ఆజాద్ దంపతులు, ఆలయ అర్చకులు, వేదపండితులు యాగశాల ప్రవేశం చేసి గణపతి, కంకణ, తదితర ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని స్వామివార్ల యాగశాలలో లోక కల్యాణార్థం చేపట్టిన విశేష పూజల సందర్భంగా చండీశ్వరునికి కంకణధారణ చేశారు.
దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా, సకాలంలో తగినంత వర్షాలు కురిసి పాడిపంటలతో తులతూగాలని, జనులందరికీ ఆయురారోగ్యాలని సంకల్పం చెప్పారు. అనంతరం దీక్షావస్త్రాలకు విశేష పూజలను చేసి ఉత్సవాల్లోపాల్గొనే వేదపండితులు, అర్చకులు భజంత్రీలకు, సంబంధిత ఆలయ సిబ్బందికి ఈవో అందజేశారు. రాత్రి 7 గంటల నుంచి భేరిపూజ, భేరితాండన, సకల దేవతాహ్వానా పూర్వక ధ్వజారోహణ కార్యక్రమాన్ని అత్యంతవైభవంగా చేపట్టారు. మకర సంక్రమణ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి 8.15 గంటలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజపటావిష్కరణ చేశారు.
అంతకుముందు ఉత్సవ నిర్వాహకుడైన చండీశ్వరున్ని పల్లకీలో ఊరేగిస్తూ ఆలయ ప్రదక్షిణ చేసి ధ్వజస్తంభం వద్దకు చేర్చారు. అక్కడ వేదమంత్రోచ్ఛారణలతో భేరి, సన్నాయిలకు వేదపండితులు, అర్చకులు విశేషపూజలు చేశారు. ధ్వజారోహణలో సంక్రాంతి బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఆధ్వర్యం వహించాల్సిందిగా బ్రహ్మదేవున్ని ఆహ్వానించారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రాజశేఖర్, పర్యవేక్షకులు మల్లికార్జునరెడ్డి, ట్రస్ట్‌బోర్డు మాజీ చైర్మన్ ఇమ్మడిశెట్టి కోటేశ్వరరావు, అర్చకులు, వేదపండితులు తదితరులు పాల్గొన్నారు.