సాక్షి, విజయవాడ: సావిత్రిభాయి పూలే 188వ జయంతి సందర్భంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఉత్తమ మహిళా ఉపాధ్యాయులకు సావిత్రి భాయి పూలే పురస్కారాలు ప్రదానం చేశారు. శుక్రవారం విజయవాడలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎంపీ కొనగళ్ళ నారాయణ, విద్యార్థి సమాఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిభాయి పూలే అని, ఆమె జయంతిని పురస్కరించుకుని ఉత్తమ మహిళా ఉపాధ్యాయురాళ్లను సత్కరించటం శుభపరిణామం అన్నారు. అలాగే మహాత్మా జ్యోతీరావు పూలే ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. అస్సృశ్యత, అంటరాని తనంపై పోరాడిన మానవతావాది జ్యోతిరావ్ పూలే అని, ఇప్పటికీ సమాజంలో పురుషాధిక్యత కొనసాగుతోందని అన్నారు. మహిళలపై దాడులు, అకృత్యాలు పెరిగిపోయాయని, దేశంలో తల్లులకు దిక్సూచి సావిత్రిభాయి పూలే అని పేర్కొన్నారు. రచయిత, సామాజిక వేత్త అయిన సావిత్రిభాయి పూలే చేసిన త్యాగం వల్లనే మహిళల చదువుకు మంచి రోజులు వచ్చాయని అన్నారు.
కాగా దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో సావిత్రిభాయి పూలే, జ్యోతీరావు పూలే జయంతి, వర్ధంతులు అధికారికంగా నిర్వహించేలా జీవోలు తెచ్చారని ఎమ్మెల్సీ తెలిపారు. మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆ జీవోను కోనసాగించలేదని, వచ్చే ఏడాది నుంచి వారి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా కృషి చేస్తామన్నారు. అలాగే మహిళా ఉపాధ్యాయులను సత్కరించేలా చర్యలు కూడా చేపడతామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మహిళలకు పెద్దపీట వేశారని, మంత్రి వర్గకూర్పులో మహిళలకు ప్రాధాన్యత కల్పించారని పేర్కొన్నారు. అలాగే మహిళల రిజర్వేషన్లు 33 శాతం నుంచి 50శాతం పెంచారని తెలిపారు. మహిళల రక్షణకు దిశ చట్టం చేశారని అన్నారు. ఇక మాజీ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ.. సావిత్రి భాయిపూలే ఆశయాలను అందరు గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ఎన్‌ఆర్‌సీ బిల్లుపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి 3 రోజుల్లో మూడు మాటలు మాట్లాడారని విమర్శించారు. ప్రజలను ప్రశాంతంగా బతకనివ్వాలని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment