సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగుల అరెస్ట్.. విడుదల
శాసనసభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు సోమవారం ఆందోళన చేపట్టారు. తెలంగాణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న సీ బ్లాక్ ఎదుట ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ చేసిన ఉద్యోగులను వెంటనే విడుదల చేయాలని మిగిలిన ఉద్యోగులు సీఎం కార్యాలయం వద్ద మౌనదీక్షకు దిగారు. దీంతో పోలీసులు ఉద్యోగులను విడుదల చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో సచివాలయ సీమాంధ్ర ఫోరం అధ్యక్షుడు యు. మురళీకృష్ణ, కేవీ కృష్ణయ్య, మురళీమోహన్, సుజాత తదితరులున్నారు.