* ఉపాధ్యాయుడిపై విద్యార్థిని బంధువుల దాడి
* అసభ్యకర మెసేజ్‌లు పంపుతున్నాడని ఆరోపణ
కాకినాడ క్రైం : అసభ్యకర మెసేజ్‌లు పంపుతున్నాడని ఆరోపిస్తూ ఓ విద్యార్థిని తల్లిదండ్రులు ఆ పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడిపై దాడి చేసి గాయపరిచారు. ఇందుకు సంబంధించి విద్యార్థిని బంధువులు, పోలీసు లు తెలిపిన వివరాలు ఇలా ... కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం ఉషోదయ మెరిట్ స్కూల్‌లో ఓ విద్యార్థిని తొమ్మిదో తరగతి చదువుతోంది. అదే పాఠశాలలో యు.కొత్తపల్లికి చెందిన మురళి మూడు నెలలుగా తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. స్కూల్ రికార్డుల్లో ఆ విద్యార్థిని ఫోన్ నంబర్ చూసిన ఈ ఉపాధ్యాయుడు ఆ నంబర్‌కు మెసేజ్‌లు పంపుతూ... మిస్డ్ కాల్స్ ఇస్తున్నాడు.
ఇది గమనించిన ఆ విద్యార్థిని తాత తిరిగి ఆ నంబర్‌కు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో ఆయన తన స్నేహితుల ద్వారా ఆ సెల్ నంబర్ చిరునామా తెలుసుకున్నాడు. ఆ ఫోన్ ఉషోదయ స్కూల్లోని తెలుగు ఉపాధ్యాయుడిదిగా గుర్తించాడు. దీంతో సోమవారం ఉదయం అతడితో మాట్లాడే పని ఉందని కొంత మంది స్కూల్ వద్దకు వెళ్లి ఆ ఉపాధ్యాయుడిపై దాడికి పాల్పడ్డారు. స్కూల్ ప్రతినిధులు ఇంద్రపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై ఆకుల మురళీకృష్ణ సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన మురళిని ఆస్పత్రికి తరలించారు. అతడిపై దాడికి పాల్పడిన వారిని సైతం అదుపులోకి తీసుకున్నారు.
తెలుగు తమ్ముళ్ల జోక్యం
ఉషోదయ స్కూల్లో ఉపాధ్యాయుడిపై విద్యార్థిని బంధువులు దాడికి పాల్పడిన సంగతి తెలుసుకున్న స్థానిక టీడీపీ నాయకుడు తన అనుచరులతో అక్కడికి చేరుకున్నాడు. ఇరు వర్గాలతో చర్చించి సమస్యను ‘సెటిల్’ చేసుకుందామంటూ పైరవీలకు దిగాడు. దీంతో అక్కడకు చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు కొందరు అసహనం వ్యక్తం చేశారు. ఒక ఆడపిల్ల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి గుణపాఠం చెప్పకుండా సెటిల్‌మెంట్ వ్యవహారానికి తెరలేపేందుకు ప్రయత్నాలు సాగించిన తెలుగు తమ్ముడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యార్థినితో ‘సెల్’గాటం
Published Tue, Oct 21 2014 12:50 AM | Last Updated on Fri, Nov 9 2018 4:32 PM
Advertisement
Advertisement