బిట్రగుంట/కావలి, న్యూస్‌లైన్: దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిలకు ప్రజలు అడుగడుగునా ఆత్మీయ నీరాజనం పలికారు. కావలిలో సమైక్యశంఖారావం బస్సుయాత్ర అనంతరం ఆదివారం రాత్రి కడనూతలలోని రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బస చేసిన ఆమె ప్రకాశం జిల్లాలో సమైక్య శంఖారావం బస్సు యాత్రకు మంగళవారం ఉదయం 10 గంటలకు బయలుదేరారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ కావలి నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డితో పాటు పలు నియోజకవర్గాల సమన్వయకర్తలు, నాయకులు షర్మిలను కలిసి సమైక్య శంఖారావం బస్సుయాత్రపై మాట్లాడారు. తనను కలిసిన పార్టీ ముఖ్యనేతలతో సమైక్య ఉద్యమంపై ఆమె చర్చించారు. ప్రకాశం జిల్లాలో సమైక్యశంఖారావం బస్సుయాత్ర ప్రారంభించేందుకు బయలుదేరగా ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రకాశం జిల్లాకు చెందిన నేతలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్, తదితర ముఖ్యనేతలు కళాశాల వద్ద నుంచే ఆత్మీయ స్వాగతం పలికి షర్మిలను ఆహ్వానించారు.