అలుపెరగని పోరు
Published Wed, Sep 11 2013 3:43 AM | Last Updated on Sat, Oct 20 2018 6:04 PM
సాక్షి, నెల్లూరు : జిల్లావాసులు 42 రోజులుగా ఏ మాత్రం అలసిపోకుండా సమైక్య ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. షర్మిల సమైక్య శంఖారావం బస్సు యాత్ర సక్సెస్ అయింది. ఆమె పర్యటన మంగళవారంతో ముగిసింది. విభజన జరిగితే సీమాంధ్ర తీవ్రంగా నష్టపోతుందని, అందువల్ల సమైక్యంగా ఉంచాలని షర్మిల డిమాండ్ చేశారు. సీమాంధ్రుల ప్రయోజనాలను ఏమాత్రం పట్టించుకోని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు వైఖరిని ఆమె తూర్పార బట్టారు. సింహపురివాసులు అలుపెరగకుండా ఉద్యమాన్ని దీక్షా దక్షతతో ముందుకు నడిపిస్తున్నారు. ఈ నెల 12 నుంచి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నట్టు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. జిల్లా వ్యాప్తంగా మంగళవారం ర్యాలీలు, రాస్తారోకోలు, మానవహారాలు, నిరసన దీక్షలు కొనసాగాయి. ఆర్టీసీ బంద్ కొనసాగుతోంది. జన జీవనం స్తంభించింది. షర్మిల సమైక్య శంఖారావం బస్సు యాత్ర మంగళవారం బోగోలు మండలం కడనూతలలోని ఆర్‌ఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ప్రకాశం జిల్లాలోకి చేరుకుంది. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులురెడ్డి, జూపూడి ప్రభాకర్‌రావు తదితరులు వెంట ఉన్నారు.
సోమవారం ఆర్‌ఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన వినాయక చవితి పర్వదిన వేడుకల్లో షర్మిల పాల్గొన్నారు. సమైక్యాంధ్ర సాధన కోసం నీటిపారుదల శాఖ ఉద్యోగులు ఇరిగేషన్ కార్యాలయం నుంచి బాలాజీనగర్, గాంధీ బొమ్మ సెంటర్‌ల మీదుగా ఎల్‌ఐసీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. బ్యాంకులను మూయించారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ నుంచి వీఆర్‌సీ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని విసృ్తతం చేసేందుకు నెల్లూరు జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, ఉపాధ్యాయులు, ఎంపీడీఓలు సంయుక్త సమావేశం నిర్వహించి కార్యాచరణ రూపొందించారు. ఉదయగిరిలో ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ రిలే దీక్షలు 14వ రోజు కొనసాగాయి. బస్టాండ్ సెంటర్‌లో తిరుమలాపురం పంచాయతీకి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు 21వ రోజు దీక్షలు చేపట్టారు.
ఆత్మకూరులో యూటీఎఫ్ ఆధ్వర్యంలోమున్సిపల్ బస్టాండ్ వద్ద ఉపాధ్యాయులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. పొదలకూరు సెంటర్‌లో సమైక్యాంధ్రకు మద్దతుగా యూటీఎఫ్‌కు చెందిన ఉపాధ్యాయులు మంగళవారం రిలే దీక్షలు నిర్వహించారు. ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం నిరాహార దీక్షా శిబిరాన్ని సందర్శించారు. కోవూరులో ఎన్జీఓ హోంలో న్యాయవాదులు, ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో గ్రామస్తుల నిరాహార దీక్ష చేపట్టారు. సూళ్లూరుపేట జేఏసీ ఆధ్వర్యంలో రైల్వేగేట్ సెంటర్‌లో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి.
మండలంలోని తీర ప్రాంత వాసులు, షార్ కాంట్రాక్ట్ కార్మికులు సూళ్లూరుపేట-శ్రీహరికోట రోడ్డులో అటకానితిప్ప వద్ద షార్‌కు వెళ్లే వాహనాలను అడ్డుకున్నారు. రాస్తారోకో, వంటావార్పు నిర్వహించారు. దీక్ష కొనసాగుతుండగా మండలంలోని అన్నమేడు జిల్లా పరిషత్ హైస్కూల్ ఉపాధ్యాయుడు బట్టా శంకర్‌యాదవ్ సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేస్తూ కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. శంకర్‌యాదవ్ మృతికి సంఘీభావంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కావలిలో ప్రభుత్వ జేఏసీ, సమైక్యాంధ్ర జేఏసీ, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి, ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు కొసాగుతున్నాయి.
Advertisement
Advertisement