ఇవి రాజకీయాలా? | Sharmila asks Chandrababu to withdraw his letter on Telangana | Sakshi
Sakshi News home page

ఇవి రాజకీయాలా?

Published Mon, Sep 16 2013 1:21 AM | Last Updated on Wed, Aug 8 2018 5:41 PM

ఇవి రాజకీయాలా? - Sakshi

ఇవి రాజకీయాలా?

  • బాబు పాదయాత్రలు, బస్సుయాత్రలు, ఢిల్లీయాత్రలు ప్రజల కోసం కాదు.. జగన్‌ను అడ్డుకోవటం కోసమే
  •  జగన్ బెయిల్‌ను అడ్డుకోవటానికి ఢిల్లీ వెళ్తున్నామని నిస్సిగ్గుగా చెప్తున్నారు.. అసలు మీరు ఏ రకం నాయకులు? ఇవి రాజకీయాలా?
  •  తెలంగాణ ఇచ్చేసుకోండని బ్లాంకు చెక్కు ఇచ్చిన చంద్రబాబు.. హత్య చేసి ఆ శవం మీదే పడి వెక్కివెక్కి ఏడ్చినట్టు ప్రజలను మభ్యపెట్టటానికి ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు
  •  ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించాలనుకుంటోంది 
  •  టీడీపీ సహా ఐదు పార్టీలు విభజనకు అనుకూలమని చెప్తే.. వైఎస్సార్ సీపీ, సీపీఎం, ఎంఐఎంలు విభజనకు ఎప్పుడూ అనుకూలమని చెప్పలేదు
  •  ఇప్పటికీ మించిపోయింది లేదు.. బాబుకు చిత్తశుద్ధి ఉంటే విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కుతీసుకోవాలి.. తాను రాజీనామా చేసి, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామాలు చేయించాలి
  •  విశాఖ, విజయనగరం జిల్లాల్లో షర్మిల 13వ రోజు సమైక్య శంఖారావం యాత్ర
  •  ప్రజల సమస్యలను కాదని.. జగన్ బెయిల్‌ను అడ్డుకునే బాబు యత్నాలపై షర్మిల ఈసడింపు
  •  
     సమైక్య శంఖారావం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘చంద్రబాబు గారు పాదయాత్రలు చేసినా, బస్సు యాత్రలు చేసినా, ఢిల్లీ యాత్రలు చేస్తున్నా ప్రజల కోసం కాదు కేవలం జగన్‌మోహన్‌రెడ్డి గారిని అడ్డుకోవటం కోసం. తొమ్మిది సంవత్సరాలు అధికారపక్షంలో ఉండి, మరో తొమ్మిది సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఆఖరికి ఒక్క యువకుడ్ని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేకుండా ఈ రోజు ఆయన బెయిల్‌ను అడ్డుకోవటానికి ఢిల్లీకి వెళ్తున్నామని నిస్సిగ్గుగా చెప్తున్నారంటే... అసలు మీరు ఏ రకం నాయకులు? ఒక అమాయకుడ్ని తీసుకెళ్లి 16 నెలలుగా నేరం రుజువు కాకుండానే జైలు పాలు చేశారంటే.. ఛీ..! ఇవి రాజకీయాలా?! మీలాంటి వాళ్లు మనుషులా?’’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఈసడించుకున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాం డ్‌తో షర్మిల పూరించిన సమైక్య శంఖారావం యాత్ర ఆదివారం 13వ రోజు విశాఖ, విజయనగరం జిల్లాల్లో సాగింది. విశాఖపట్నం నగరం, విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో జరిగిన సమైక్య శంఖారావం సభలకు భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ఈ ప్రసంగాల సారాంశం ఆమె మాటల్లోనే...
     
     మీ ఎమ్మెల్యేలను బేరం పెట్టటానికి వెళుతున్నారా బాబూ?
     ‘‘చంద్రబాబు గారు ఇప్పుడు ఢిల్లీకి వెళ్తున్నారట. ఎందుకు వెళ్తున్నారు చంద్రబాబు గారు అంటే.. రాష్ట్రంలో చాలా అనిశ్చితి నెలకొని ఉందట.. ఈ అనిశ్చితిని దూరం చేయాలని కాంగ్రెస్ పార్టీని అడగటానికని చంద్రబాబునాయుడు గారు ఢిల్లీకి వెళ్తున్నారట. అసలు ఈ అనిశ్చితికి కారణం మీరు కాదా చంద్రబాబు గారూ? తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇచ్చి ఈ అనిశ్చితికి కారణమై మళ్లీ ఏ మొఖం పెట్టుకొని అనిశ్చితి దూరం చేయటానికి వెళ్తున్నానని చెప్తున్నారు చంద్రబాబు గారూ? తెలుగుదేశం పార్టీలో ఉన్న రెండు ప్రాంతాల నాయకులను తీసుకొని ఢిల్లీకి వెళ్తున్నానని చంద్రబాబు గారు అంటారు. అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చంద్రబాబు గారు? మీది రెండు కళ్ల సిద్ధాంతం అని చెప్పాలనుకుంటున్నారా? మీది రెండు నాలుకల ధోరణి అని చెప్పాలనుకుంటున్నారా? అందుకనే ఎప్పుడూ రెండు వేళ్లు ఊపుకుంటూ తిరుగుతారా? ఏం చెప్పాలనుకుంటున్నారు? సమైక్యానికి అనుకూలం అని చెప్పాలనుకుంటున్నారా? లేక విభజనకు అనుకూలం అని చెప్పాలనుకుంటున్నారా? లేకపోతే నాకు ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంత మంది ఎంపీలు ఉన్నారు చూడండీ అని, వాళ్లను అమ్మకానికి పెట్టి.. జగన్‌మోహన్‌రెడ్డి గారికి ఎలాగైనా బెయిల్ రాకుండా చూడ్డానికి బేరాలు కుదుర్చుకోవటానికి ఢిల్లీ వెళ్తున్నారా? లేకపోతే ఒక కిరణ్‌కుమార్‌రెడ్డి గారికే కాదు, ఒక బొత్స సత్యనారాయణ గారికే కాదు నాకు కూడా సోనియాగాంధీ గారు అధిష్టానమే.. మీరు ఏది ఆదేశిస్తే అది శిరసా వహిస్తాను.. అని చెప్పి కాళ్ల మీద పడి.. నామీద మట్టుకు ఏ కేసులు, విచారణలు జరగకుండా చూడండి అని వేడుకోవడానికి వెళ్తున్నారా? చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసిన ట్టు మీరు కూడా తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేసుకుంటే కనీసం మీకు కేంద్రమంత్రి పదవైనా వస్తుందేమో..! ఈ రాష్ట్రంలో ఉంటే మీకు ఏదీ రాదు చంద్రబాబు గారు. తెలంగాణను ఇచ్చేసుకుంటే ఇచ్చేసుకోండి అని బ్లాంకు చెక్కు ఇచ్చేసినట్లు లేఖలు రాసి ఇచ్చేశారు ఈ చంద్రబాబుగారు. హత్య చేసి ఆ శవం మీదే పడి వెక్కివెక్కి ఏడ్చినట్టు చంద్రబాబు గారు తెలంగాణకు అనుకూలంగా లేఖనిచ్చేసి ఇప్పుడు ప్రజలను మభ్యపెట్టటానికి మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. 
     
     సీఎం, బొత్సలు దిష్టిబొమ్మల్లాగా కూర్చున్నారు...
     ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టాలనుకుంటోంది. కనీసం ఈ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్తారని అనుకుంటే దిష్టిబొమ్మలాగా కూర్చున్నారు. బొత్సగారు ఈ ప్రాంతం నాయకుడు కదా! పీసీసీ అధ్యక్షుడు కదా! ఈయన గారైనా ఏమైనా సమాధానం చెప్తాడా? అంటే.. ఈయన గారు కూడా ఇంకో దిష్టి బొమ్మలాగా నిల్చొని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేస్తుందని, ఆ విషయం గురించి మన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గారికి, బొత్స గారికి చాలా స్పష్టంగా ఎప్పటి నుంచో తెలుసని కేంద్రమంత్రి కిశోర్‌చంద్రదేవ్ గారు స్వయంగా చెప్పారు. అంటేముఖ్యమంత్రికి, బొత్స గారికి ఈ కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని చీల్చబోతున్న సంగతి తెలిసి కూడా.. అడ్డుకుంటే వీళ్ల పదవులు ఎక్కడ పోతాయోనని అడ్డుకోనూ లేదు. బొత్స గారూ..! కాంగ్రెస్ పార్టీ చీల్చుతుందన్న సంగతి ముందు మీకు తెలుసా? తెలియదా? ముందే తెలిస్తే ఎందుకు అడ్డుకోలేదు? కనీసం ప్రజలకు ఎందుకు చెప్పలేదు? లేకపోతే మీకు చెప్పకుండానే చేసి ఉంటే.. దిగ్విజయ్‌సింగ్ గారు మన రాష్ట్రాన్ని చీల్చుతున్నామని ప్రకటన చేసిన రోజే మీరు ఎందుకు రాజీనామాలు చేసి ప్రజల పక్షాన నిలబడలేదు? 
     
     మేం విభజనకు ఎప్పుడూ మద్దతు పలకలేదు...
     తెలుగుదేశం పార్టీతో సహా ఐదు పార్టీలు ఈ విభజనకు మద్దతు పలికితే.. మూడు పార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, ఎంఐఎం పార్టీలు ఎప్పుడూ విభజనకు మద్దతు పలకలేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉన్నా, ఇంకా ఆయనలో ఏమాత్రం నిజాయితీ మిగిలి ఉన్నా తాను కూడా తెలంగాణకు వ్యతిరేకమేనని.. ఇప్పటికైనా ఈ మూడు పార్టీల పక్షాన నాలుగో పార్టీగా చేరి, కోట్ల మంది ప్రజలకు క్షమాపణ చెప్పి, తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలి. కోట్ల మంది ప్రజలకు అన్యాయం చేయటం తగదని ఆయన రాజీనామా చేయాలి. తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను రాజీనామా చేయించాలి. అంతవరకు చంద్రబాబు గాని, టీడీపీ నాయకులు గాని సీమాంధ్రలో అడుగుపెట్టడానికి వీలు లేదని ప్రజలంతా తరిమి కొట్టాలి. 
     
     ఆ రోజే వారు కూడా రాజీనామా చేసి ఉంటే...
     హఠాత్తుగా ఏ పరిష్కారం చూపించకుండా కాంగ్రెస్ పార్టీ ఓట్లు, సీట్ల కోసం మన రాష్ట్రాన్ని చీలుస్తున్నామని ప్రకటించిన వెంటనే, ఆ సంకేతాలు పంపించిన వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అంతమంది నాయకులు రాజీనామాలు చేశారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి గారు కూడా రాజీనామాలు చేశారు.. నిరాహార దీక్షలు చేశారు. లేఖల మీద లేఖలు రాసి.. ఇది అన్యాయం మా రాష్ట్రాన్ని విడగొట్టొద్దని ఈ రోజుటి వరకు పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ ఎంత మంది టీడీపీ, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజీనామాలు చేసిన రోజునే వీళ్లందరూ రాజీనామాలు చేసుంటే.. కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకునేలా ఒత్తిడి పెరిగేది. కానీ పదవీ మత్తులో మునిగి తేలుతున్న ఈ కాంగ్రెస్, టీడీపీ నాయకులు ప్రజలకంటే తమ పదవే ముఖ్యమని మళ్లీ నిరూపించుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచీ ఒకే మాట చెప్పింది. ఏ ఒక్క ప్రాంతానికి అన్యాయం జరగకుండా, ఒక కన్నతండ్రిలాగా ఆలోచన చేయాలి. 
     
     ఆ ఆలోచన మీరు ఎలా చేస్తారో మీ ఉద్దేశం ఎలా ఉందో ముందు అందరినీ పిలవండి అని పదేపదే చెప్పింది, లేఖలు రాసింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజాస్వామ్య దేశమనే విషయాన్నే మరచి వ్యవహరించింది. అందుకే మళ్లీ చెప్తున్నాం. న్యాయం చేయ డం మీ ఉద్దేశమే కాదని తేలిపోయింది కనుక  రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. సమైక్య రాష్ట్రం కోసం జగనన్న నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రజల తరఫున నిలబడి పోరాటం చేస్తుందని మీకు మాటిస్తున్నాం.’’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement