జ్యోతి కాదు..అపరకాళిక
కత్తితో దాడికి యత్నించిన దుండగుడిపై తిరగబడిన యువతి
కళ్యాణదుర్గం : దుండగుడు కత్తితో దాడి చేసినా ఆ యువతి వెరవలేదు. భయపడలేదు. అందరి ఆడపిల్లల్లా దౌర్జన్యానికి తలొగ్గలేదు. ఎవరో వచ్చి కాపాడుతారని ఎదురు చూడలేదు. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించింది. చాకచక్యంగా దుండగుడి చేతిలోని కత్తి లాక్కొని అపరకాళికగా మారింది. దీంతో దుండగుడు కాళ్లకు పనిచెప్పాల్సి వచ్చింది. కళ్యాణదుర్గంలో సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని దొడ్డగట్టరోడ్డులో నాగరాజు, లక్ష్మిదేవి దంపతులు నివాసం ఉంటున్నారు. నాగరాజు పాల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
వీరి కుమార్తె జ్యోతి డిగ్రీ పూర్తి చేసి కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న జ్యోతి.. దొడ్డగట్ట రోడ్డులోని పూర్ణానంద స్వామి ఆశ్రమం వద్దకు రోజు పాలు ఇచ్చి ఇంటికి వచ్చేది. రోజువారి తరహాలోనే శనివారం సాయంత్రం ఆశ్రమంలో పాలు ఇచ్చి బయల్దేరింది. ఇంటి సమీపంలోనే గుర్తు తెలియని యువకుడు ముఖానికి ఖర్చీఫ్ కట్టుకుని కత్తితో దాడికి ప్రయత్నించాడు.
ప్రతిఘటించిన జ్యోతి..ఆ వ్యక్తిని ఒక చేత్తో గొంతుపట్టుకుని మరో చేతితో కత్తి గుంజుకుంది. దీంతో దుండగుడు జ్యోతి నుంచి తప్పించుకొని పక్కనే ఉన్న కంపచెట్లలోకి పరుగులు తీశాడు. అనంతరం జ్యోతి టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.