- రుణాలు చెల్లించాలని రైతులకు నోటీసులు
- బంగారం వేలానికి బ్యాంకులు సిద్ధం
- కోర్టుకీడ్చేందుకూ వెనుకాడని వైనం
- ‘రుణమాఫీ’పై అన్నదాతల్లో ఆందోళన
- ఖరీఫ్ సాగు ఖర్చులపైనా బెంగ
గోరుచుట్టుపై రోకటిపోటులా మారింది జిల్లాలోని రైతుల పరిస్థితి. ఖరీఫ్ సాగు ఖర్చుల కోసం అన్నదాతలు అప్పుల వేటలో ఉన్నారు. పాత బకాయిలు చెల్లిస్తేనే కొత్త రుణాలు ఇస్తామని బ్యాంక్ అధికారులు తెగేసి చెబుతున్నారు. ఎన్నికల ముందు రైతుల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాన్చుడు మొదలు పెట్టారు. రుణాల వసూలు కోసం బ్యాంకర్లు మాత్రం స్పీడు పెంచారు. అసలే అప్పుల వేటలో ఉన్న అన్నదాతలకు నోటీలు అందడంతో కంగుతింటున్నారు.
మచిలీపట్నం : ఎన్నికల ముందు ఏ ఒక్క రైతు బ్యాంకులకు రుణాలు చెల్లించవద్దని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత శ్వేతపత్రాలంటూ తెల్లమొహం వేశారు. అప్పు చెల్లించాలని బ్యాంకుల నుంచి వస్తున్న నోటీసులు చూసి దిక్కుతోచని అన్నదాతలు బిక్కముఖం పెడుతున్నారు. జిల్లాలో వివిధ బ్యాంకుల నుంచి 6,29,086 ఖాతాల ద్వారా రైతులు రూ.9,137 కోట్ల వ్యవసాయ రుణాలు తీసుకున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రైతులకు రుణాలు ఇవ్వాలంటే గతంలో తీసుకున్న పంట రుణాలను తిరిగి చెల్లించాలని బ్యాంక్ అధికారులు స్పష్టంచేస్తున్నారు. పాత బకాయిలు చెల్లించని రైతులకు నోటీసులు జారీ చేస్తున్నారు. పాత పద్ధతిలోనే ఈ నోటీసులు జారీ అవుతున్నాయని బ్యాంకు అధికారులు చెబుతున్నా.. ప్రభుత్వం రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిన నేపథ్యంలో ప్రాధాన్యతను సంతరించుకుంది.
బంగారం వేలానికి సిద్ధం..
తోట్లవల్లూరు యూకో బ్యాంకులో బంగారు ఆభరణాలపై తీసుకున్న రుణాలకు కాలపరిమితి ముగియనుండటంతో జూన్ 7వ తేదీన బహిరంగ వేలం నోటీసు ఇచ్చారు. మొత్తం 49 మంది రైతులకు సంబంధించిన బంగారు ఆభరణాలను జూన్ 25న వేలం వేయనున్నట్లు ఆ నోటీసులో పేర్కొన్నారు. వీరిలో 34 మంది రైతులు వ్యవసాయం కోసం బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకున్నారు. వారి అప్పు మొత్తం రూ.14 లక్షల వరకు ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. దీంతో రైతులు గత నెల 24న పంటరుణాలకు వడ్డీ చెల్లించడంతో బంగారు నగల వేలం నిలిపివేశారు.
కృత్తివెన్నులోనూ ఇదే తంతు..
కృత్తివెన్నులోని ఇండియన్ బ్యాంకు నుంచి 65 మంది రైతులు పంట రుణాలుగా రూ.68.28 లక్షలు తీసుకున్నారు. వీరిలో 40 మంది బంగారు నగలు తాకట్టుపెట్టి రుణాలు పొందారు. పంట రుణాలను చెల్లించాలని జూన్ 21వ తేదీన బ్యాంకు అధికారులు రైతులకు నోటీసులు జారీచేశారు. రుణాలు చెల్లించాలా... వద్దా.. అనే మీమాంసలో రైతులు ఉన్నారు. బ్యాంకు అధికారులు మరింతగా ఒత్తిడి తెస్తే వడ్డీ చెల్లించి కొంతకాలం బంగారు నగలు వేలం వేయకుండా కాపాడుకోవచ్చని భావిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం తక్షణం రైతుల రుణాలను మాఫీ చేసి ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
రుణమాఫీపై కాలయాపన తగదు
రైతు రుణాలు మాఫీ చేస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. కమిటీలు, విధివిధానాలంటూ కాలయాపన చేయటం తగదు. వ్యవసాయం కోసం బంగారు నగలు కుదవపెట్టి అప్పు తెచ్చాం. ఇప్పుడు బ్యాంకు వారు అప్పు కట్టకపోతే నగలు వేలం వేస్తామంటూ నోటీసులు ఇస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలి. బ్యాంకులు జారీచేసిన నోటీసులు వెనక్కి తీసుకునేలా చర్యలు తీసుకోవాలి.
- అర్జంపూడి బ్రహ్మేశ్వరరావు, శీతనపల్లి