ప్రైవేటు స్పీడుకు కళ్లెం!
► ప్రైవేటు బస్సులకు ఎస్‌ఎల్‌డీ ఏర్పాటు
► తొలుత కాంట్రాక్ట్ క్యారియర్, స్కూలు బస్సులకు
► ట్యాంపరింగ్‌కు పాల్పడితే వాహనం సీజ్
విజయనగరంఫోర్ట్: గాలికన్నా వేగంగా దుసుకుపోతూ హడలెత్తించే ప్రైవేటు బస్సుల జోరుకు ఇక బ్రేక్‌లు పడబోతున్నట్టే. ప్రమాదాలకు కారణమవుతున్న అతివేగానికి కళ్లెం వేయాలని రవాణా శాఖ అధికారులు నిర్ణయించారు. కాంట్రాక్ట్ క్యారియర్, స్కూలు బస్సులకు స్పీడ్ లిమిట్ డివైజ్(ఎస్‌ఎల్‌డీ) పరికరాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు ఆంక్షలు పెట్టారు. ప్రతీ బస్సులో దీనిని అమర్చాలని ఆదేశాలు జారీ చేశారు. ఎస్‌ఎల్‌డీ పరికరాన్ని ఏర్పాటు చేయని బస్సులపై దాడులు చేయనున్నారు.
మోటారు వాహనాల చట్టంలో ప్రతీ వాహనం గంటకు 80 కిలోమీటర్ల వేగానికి మించకుండా ప్రయాణించాలి. దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. అత్యా«ధునిక పరిజ్ఞానంతో తయారైన బస్సులు 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తున్నాయి. ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న బస్సు ప్రమాదాలకు అతివేగమే కారణమనిరుజువైంది. దీంతో మోటారు వెహికల్ చట్టం అమల్లోకి వచ్చింది. బస్సులతో పాటు వివిధ రవాణా వాహనాలకు ఎస్‌ఎల్‌డీలు ఏర్పాటు చేయాలని నిబంధన ఉంది.
1997 నాటి నిబంధనల ప్రకారం బస్సులు గంటకు 80 కిమీ, కారు 100కిమీ, లారీలు 80కిమీ, స్కూలు బస్సులు 60 కిమీ వేగంతో ప్రయాణించాలి. విదేశీ పరిజ్ఞానంతో తయారైన కార్లు, బస్సులు గంటకు 120 కిలోమీటర్లు లేదా అంతకు మించి వేగంతో దూసుకుపోతున్నాయి. మన దేశంలో రహదారుల వ్యవస్థ ప్రకారం గంటకు 80 నుంచి 100 కిలో మీటర్లు కంటే మించి వెళ్లేందుకు అనుకూలం కాదు.
అన్ని బస్సులకూ ఇక తప్పనిసరి
గత నెల 21వ తేదీన కాంట్రాక్ట్ క్యారియర్ వాహనాల యజమానులతో రవాణాశాఖ కమిషనర్ సుబ్రహ్మణ్యం సమావేశమై ఎస్‌ఎల్‌డీల గురించి వివరించారు. నిజానికి 2015 ఆక్టోబర్ నుంచి కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన బస్సులకు ఈ నిబంధన అమల్లో ఉంది. అంతకు ముందు రిజిస్ట్రేషన్ అయిన వాహనాల్లోనూ అమర్చుకోవాలని కమిషనర్ సూచించారు.
వేగ నియంత్రణకు దోహదం
ఎస్‌ఎల్‌డీ పరికరం బస్సులకు అమర్చడం వల్ల కాంట్రాక్ట్ క్యారియర్ బస్సులకు అయితే గంటకు 80 కిలోమీటర్లు, స్కూలు బస్సులకు అయితే 60కిలోమీటర్లకు వేగాన్ని నియంత్రిస్తుంది. దీనివల్ల డ్రైవర్ వేగంగా వెళ్లాలన్నా అవకాశం ఉండదు. అయితే ప్రభుత్వం గుర్తించిన ఆటోమేటిక్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రోడ్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ సెంటర్ పర్ అటోమోటివ్ టెక్నాలజీ సంస్థల నుంచే వీటిని తీసుకోవాలని సూచించింది.
వీటికి మినహాయింపు
ద్విచక్ర, మూడు చక్రాల వాహనాలు, 9 సీట్ల సామర్ధ్యానికి మించని ప్యాసింజర్ తరహా వాహనాలు, 3.5 టన్నుల లోపు సామర్థ్యం గల రవాణా వాహనా లు, అగ్నిమాపక వాహనా లు, అంబులెన్సు, పోలీస్ వాహనాలకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది.
ఎస్‌ఎల్‌డీ తప్పనిసరి
ముందుగా కాంట్రాక్ట్ క్యారియర్ బస్సులకు స్పీడ్ లిమిట్ డివైజ్ పరికరాన్ని అమర్చుకోవాలి. అలా కాని పక్షంలో రవాణా కార్యాలయం నుంచి సంబం«ధించిన కార్యకలాపాలు సాగవు. పర్మిట్, రెన్యూవల్, ఫిట్‌నెస్ సర్టిఫికేట్ మంజూరులో ఎస్‌ఎల్‌డీ పరికరాన్ని పరిశీలిస్తాం. అమర్చకపోతే పనులు చేయం. వారం రోజుల తర్వాత బస్సులపై దాడులు చేస్తాం. ఎస్‌ఎల్‌డీ ఏర్పాటు చేయకపోతే చర్యలు తీసుకుంటాం. – ఎం.కనకరాజు, ఇన్‌చార్జ్ ఆర్టీఓ