
క్రీడా సంబరం
పుట్టపర్తిలోని హిల్‌వ్యూ స్టేడియంలో ఆదివారం సత్యసాయి 31 వ క్రీడా సాంస్కృతిక సమేళనం ఉత్కంఠభరితంగా జరిగింది.
పుట్టపర్తి అర్బన్ : పుట్టపర్తిలోని హిల్‌వ్యూ స్టేడియంలో ఆదివారం సత్యసాయి 31 వ క్రీడా సాంస్కృతిక సమేళనం ఉత్కంఠభరితంగా జరిగింది. ప్రతి ఏడాది ఆనవాయితీగా నిర్వహించే క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. సత్యసాయి ట్రస్ట్ సభ్యులు ఆర్‌జే రత్నాకర్, నాగానంద, చక్రవర్తి, శ్రీనివాసన్, ఎస్‌వి గిరి, టీకేకే భగవత్, కార్యదర్శి ప్రసాదరావు, కళాశాలల వైస్ ప్రిన్సిపాల్ కేబీఆర్ వర్మ తదితరులు ఆధ్వర్యంలో సత్యసాయి విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు క్రీడాజ్యోతిని వెలిగించారు.
ముఖ్య అతిథిగా మంత్రి పల్లె రఘునాథరెడ్డి పాల్గొన్నారు. ఉదయం 8 గంటలకు అనంతపురం, ముద్దనహళ్లి, బృందావనం, ప్రశాంతినిలయం, వైట్‌ఫీల్డ్ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు సత్యసాయి చిత్రపటాన్ని ఊరేగింపుగా క్రీడాప్రాంగణానికి తీసుకొచ్చారు. వేలాది మంది విద్యార్థుల నడుమ క్రీడా సాంస్కృతిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వివిధ రంగుల యూనిఫాంలతో విద్యార్థులు మార్చ్‌ఫాస్ట్ ఆకట్టుకుంది. లయ బద్దంగా బ్రాస్‌బ్యాండ్ వాయించారు.
గౌరవ వందనం స్వీకరించిన అనంతరం శాంతి చిహ్నంగా తెల్లటి పావురాన్ని, వివిధ రంగుల బెలూన్లను ఎగురవేశారు. చైనీస్ డ్రాగన్ డ్యాన్సు ఆకట్టుకుంది. ఫ్రీఫాల్‌ఇన్ కాయిన్, బైక్ రేస్, అగ్నికీలల్లో బైకులు నడుపుతూ చూపరులను గగుర్పాటకు గురిచేశారు. అనంతరం విద్యార్థినులు జిమ్నాస్టిక్స్ విన్యాసాలు నిర్వహించారు. ఈక్రమంలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఉత్సవాల్లో పాల్గొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యూరు. వేలాది మందితో స్టేడియం కిటకిటలాడింది.
సాయంత్రం 4 గంటల నుంచి మరి కొంత మంది విద్యార్థులు పలు విన్యాసాలతో పాటు,స్కేటింగ్ సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి డెరైక్టర్ డాక్టర్ ఓలేటి చౌదరి, టీవీఎస్ అధినేత శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు.