సాక్షి, తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి రథ సప్తమి వేడుక అశేష భక్తజనం మధ్య గురువారం వైభవంగా జరిగింది. వేకువజామున ఆలయంలో సుప్రభాతం, తోమాల, అర్చన, ఇతర వైదిక సేవల అనంతరం ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనం ప్రారంభించి 9.30 గంటలకు పూర్తిచేశారు. తర్వాత వరుసగా చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల వాహనాలపై స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం 2.20 గంటలకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం శాస్త్రోకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేశారు.
రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహనంపై శ్రీవారు మాడవీధుల్లో ఊరేగడంతో రథసప్తమి మహోత్సవం ముగిసింది. ఉత్సవమూర్తిని భక్తులు దర్శించుకునే సమయంలో పలుచోట్ల తోపులాటలు చోటుచేసుకున్నాయి. కాగా, ఉదయం 6.58 గంటలకు దినకరుని తొలి కిరణాలు దేవదేవుని పాద పద్మాలను తాకాయి. భానుడి కిరణాలు తొలుత సూర్యప్రభను, ఆ తర్వాత స్వామి కిరీటం, ముఖతేజస్సు, కంఠాభర ణాలు, వక్షస్థలం, ఉదర భాగాల నుంచి పాద పద్మాలను తాకుతూ స్వర్ణకాంతులతో స్వామిని అభిషేకించాయి.