చిరంజీవిపై రాళ్లువిసిరిన సమైక్యవాదులు
శ్రీకాకుళం: కేంద్ర మంత్రి చిరంజీవి ఏమంటా వరద ముంపు ప్రాంతాలలో పర్యటన మొదలు పెట్టారో అడుగడుగునా ఆందోళనలు, అటంకాలే ఎదురవుతున్నాయి. విశాఖ జిల్లా యలమంచిలిలో నిన్న వరద బాధితులు చిరంజీవి తమ వద్దకు రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తరువాత తూర్పుగోదావరి జిల్లా తిమ్మాపురంలో నాటుపడవ ఎక్కబోతూ కాలుజారి నీటిలో పడ్డారు. ఈరోజు రాజాంలో సమైక్యవాదులు అతనిపై రాళ్లు విసిరారు. వరద ముంపు ప్రాంతాలలో పర్యటనకు వచ్చిన చిరంజీవి కాన్వాయ్పై విద్యార్థులు రాళ్లు రువ్వారు. వారితోపాటు సమైక్యవాదులు కూడా రాళ్లు విసిరారు. పదవి వదులుకున్న తరువాతే పర్యటనకు రావాలని సమైక్యవాదులు డిమాండ్ చేశారు.
నిన్న ఉదయం చిరంజీవి విశాఖపట్నం జిల్లా యలమంచిలి మీదగా వెళ్లారు. ఇక్కడ వరదకు గురైన ప్రాంతాలను చూడలేదు. బాధితులనూ పలకరించలేదు. కేంద్ర మంత్రి చిరంజీవి యలమంచిలి వస్తున్నట్లు చెప్పడంతో బాధితులు ఆయన కోసం ఎదురు చూశారు. దాదాపు మూడు గంటలపాటు ఆయన కోసం వేచి ఉన్నారు. కానీ ఆయన యలమంచిలి పట్టణంలోకి రాకుండా, బైపాస్ రోడ్డున వెళ్లిపోయారు. దాంతో స్థానిక వరద బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. కష్టాలు పడుతున్న తమను పట్టించుకోవడంలేదని వాపోయారు.
ఆ తరువాత కాకినాడ సమీపంలోని తిమ్మాపురంలో వరద ముంపు ప్రాంతాలలో పర్యటించే సమయంలో పడవ ఎక్కబోయి కాలుజారి నీటిలో పడ్డారు. అయితే సిబ్బంది వెంటనే ఆయనను పట్టుకొని లేపారు. ఈ విధంగా ఆయన వెళ్లిన ప్రతిచోట ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతోంది.