
Vijayamma
హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియను వెంటనే ఆపాలని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ లేఖ రాశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆ లేఖలో ఆమె కోరారు. వాస్తవాలను మరుగునపరుస్తున్నారని పేర్కొన్నారు. సీపీఎం మినహా మిగిలిన పార్టీలు తెలంగాణకు సానుకూలమని ఎలా చెప్తారని ఆమె ప్రశ్నించారు. విభజనకు ఐదుపార్టీలు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. బీజేపీ, టీఆర్‌ఎస్, టీడీపీ, సీపీఐ తెలంగాణకు అనుకూలం అని వివరించారు. వైఎస్సార్‌సీపీ, సీపీఎం, ఎంఐఎం విభజనను వ్యతిరేకిస్తున్నాయని స్పష్టం చేశారు.
ఉన్నత పదవిలో ఉన్న మీరు వాస్తవాలను ఎందుకు మరుగునపరుస్తున్నారని విజయమ్మ షిండేను ప్రశ్నించారు. 2012 డిసెంబర్ 28నాటి అఖిలపక్ష సమావేశం నుంచి తాము విభజనను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ప్రధానికి రాసిన లేఖను కూడా ఆ లేఖకు జతపరుస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక ప్రాంతానికి న్యాయం చేయమంటే మరో ప్రాంతానికి అన్యాయం చేయమని కాదుకదా? అని ప్రశ్నించారు. ఓట్లు, సీట్ల కోసం ప్రాథమిక న్యాయసూత్రాలను కాంగ్రెస్ విస్మరించిందన్నారు. విభజన నిర్ణయంతో కోస్తా, రాయలసీమ ప్రాంతాలు అట్టుడుకుతున్నాయని తెలియజేశారు. అలాంటప్పుడు ఏకాభిప్రాయం కుదిరిందని కాంగ్రెస్ ఎలా చెప్పగలదు? అని విజయమ్మ ప్రశ్నించారు.
రాష్ట్రం కలిసున్నప్పుడు మహారాష్ట్ర, కర్ణాటకతో నీటిసమస్యలు తలెత్తుతున్నాయి. రాష్ట్రం విడిపోతే పోలవరం ప్రాజెక్టుకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? అని అడిగారు. రాష్ట్ర ఆదాయంలో 50 శాతం హైదరాబాద్ నుంచే వస్తుంది. విడిపోతే ఉద్యోగాల కోసం సీమాంధ్రులు ఎక్కడికెళ్లాలి? అని ప్రశ్నించారు. 43 రోజులుగా సీమాంధ్రలో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ప్రజల జీవితాలతో కాంగ్రెస్ పార్టీ చెలగాటమాడుతోందని ఆ లేఖలో విజయమ్మ విమర్శించారు.