యాచారం, న్యూస్‌లైన్ : దళితులు, గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు ఉద్దేశించిన ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక ప్రభుత్వ నిర్లక్ష్యంతో నీరుగారుతోంది. దేశంలోనే ప్రప్రథమంగా ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికను రూపొందించి చట్టబద్ధత కల్పించామని.. రూ.కోట్ల రూపాయలు వారి సంక్షేమానికి కేటాయించామని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. అరకొర నిధులు విడుదల చేస్తూ ఉప ప్రణాళికను ‘ఉత్త’ ప్రణాళికగా మార్చేస్తోంది. కాలనీల్లో అభివృద్ధి పనులు వెంటనే చేపట్టనున్నట్టు ప్రజా ప్రతినిధులు, అధికారులు నమ్మబలకడంతో దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీలు అరకొర నిధులు మంజూరు కావడంతో నిరుత్సాహానికి గురవుతున్నారు.
ఉదాహరణకు యాచారం మండలంలోని 20గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనుల కోసం దళితులు, గిరిజనులు రెండువేలకు పైగా అర్జీలు పెట్టుకున్నారు. అధికంగా ఇళ్లు, సీసీ రోడ్లు, డ్రెయినేజీ కాల్వలు, వీధి లైట్లు, కమ్యూనిటీ భవనాలు, తాగునీటి సరఫరా మెరుగు కోసం దరఖాస్తు చేసుకున్నారు. మండల పరిధి 20 గ్రామాల్లోని ఎస్సీ కాలనీల్లో నేటికీ సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేదు. ఇక నందివనపర్తి అనుబంధ తండాలైన బొల్లిగుట్ట, ఎనెకింది, నీలిపోచమ్మ తండా, మంతన్‌గౌరెల్లి పరిధిలోని భానుతండా, కేస్లీతండా, మంతన్‌గౌడ్, కొత్తపల్లి తండా, తక్కళ్లపల్లి అనుబంధ ఎర్రగొల్ల తండా, వేపపురితండా ఇలా మండలంలోని 19 తండాల్లో మౌలిక వసతులు అటుంచి కనీస రోడ్డు కూడా లేకపోవడంతో గిరిజనులు నిత్యావసరాల కోసం కాలినడకన కిలోమీటర్ల దూరంలోని గ్రామాలకు వెళ్లాల్సి వస్తోంది.
ప్రతిపాదనలు రూ.30కోట్లకు.. మంజూరైంది రూ.7.30లక్షలే!
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద చేపట్టాల్సిన పనుల కోసం ప్రతిపాదనలు పంపాలన్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన క్షేత్రస్థాయి సిబ్బంది దరఖాస్తులను పరిశీలించి అభివృద్ధి పనుల విలువ లెక్కకట్టారు. 20 గ్రామాలు, 19 తండాల్లో అభివృద్ధి పనుల కోసం రూ.30 కోట్లకు పైగా నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపా రు. అయితే ఇళ్లు, సీసీ రోడ్లు, డ్రెయినేజీ వ్యవ స్థ నిర్మాణాలు, తాగునీటి సమస్య పరిష్కారాలకు నిధుల మంజూరును పక్కన పెట్టిన ఉన్నతాధికారులు కేవలం ఒక్క కమ్యూనిటీ భవన నిర్మాణానికి మాత్రమే నిధులు విడుదల చేశారు. మొత్తం 12 గ్రామాల్లో కమ్యూనిటీ భవనాలు ప్రతిపాదించగా, ఒక్క మంతన్‌గౌరెల్లిలో మాత్రమే నిర్మించడానికి రూ.7.30లక్షలు మంజూరయ్యాయి.
ఇటీవల మంతన్‌గౌరెల్లిలో పర్యటించిన ఎంపీడీఓ.. ఎస్సీ కాలనీ లో కమ్యూనిటీ భవనం నిర్మాణానికి నిధులు మంజూరైన విషయం గ్రామస్తులకు తెలియజేశారు. కాగా, మంతన్‌గౌరెల్లి గ్రామంలోనే కమ్యూనిటీ భవనానికి నిధులు మంజూరైన విషయం తెలుసుకున్న మిగతా గ్రామాల ఎస్సీ కాలనీవాసులు తమ దరఖాస్తులను అధికారులు పక్కనపెట్టారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు జిల్లాలోని అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి కన్పిస్తున్నది.