సోగ్గాడే చిన్నినాయన సినిమాలో బంగార్రాజు యువతులతో సరసాలు.. మాటలతో దగ్గరకి చేర్చుకోవడం చేస్తూ సరి కొత్తపాత్రలో కనిపిస్తాడు. అదే తరహాలో తిరుపతి మెప్మాలో ఓ ప్రధాన ఉద్యోగి మహిళలతో ప్రవర్తించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయనగారి రాసలీలలపై బాధిత మహిళలు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు. ఆ ఉద్యోగిపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేసుకున్నారు.
సాక్షి, తిరుపతి: ఇటీవల కడప జిల్లా నుంచి బదిలీపై తిరుపతి మెప్మాకు వచ్చిన ఓ ఉద్యోగి చెప్పిందే వేదంలా ఉంది. ఆయన ఔనంటే రుణం అందుతుంది.. మాఫీ అవుతుంది.. కాదంటే అంతే. ఇంత ఘనుడైన ఈయన గారిని ప్రసన్నం చేసుకునేందుకు పొదుపు సంఘాల, ఇతర రుణాలను స్వాహాచేసిన వారు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఈనేపథ్యంలో ఆ ఉద్యోగికి కార్యాలయంలోనే రాచమర్యాదలు జరుగుతున్నాయి. ఇందుకు ఆ ఉద్యోగికి ఇష్టమైన వంటలు వండుకొచ్చేది ఒకరైతే.. అవసరమైతే కాళ్లు పట్టేందుకు ఇంకొకరు పోటీపడుతున్నట్లు మెప్మా వర్గాలు వెల్లడిస్తున్నాయి.
కార్యాలయంలోని ఆ ఉద్యోగి ఛాంబర్‌లోనే మధ్యాహ్నం వెరైటీ వంటలను వండుకొచ్చి ఆయన గారికి వడ్డిస్తున్నారు. అంతటితో ఆగకుండా ఆ అధికారి చిల్లర చేష్టలకు దిగుతున్నారని సంఘాల సభ్యులు వాపోతున్నారు. ఇదే విషయం ఇప్పటికే సంబంధిత మెప్మా పీడీ జ్యోతి దృష్టికి వెళ్లింది. అలాగే కొంతకాలంగా వేధింపుల ఆగడాలు వెల్లువెత్తుతున్నాయి. విధుల్లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఇలా ‘ప్రత్యేక’ గుర్తింపు తెచ్చుకున్నారు. ఫిర్యాదుల ఆధారంగా ఆ ఉద్యోగిని ఒకట్రెండు రోజుల్లో ఉద్యోగం నుంచి తొలగించేందుకు దస్త్రాలు సిద్ధమైనట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు.
చెప్పినట్లు వినాల్సిందే..
వివిధ రుణాలు, సంఘాల లావాదేవీలపై తన వద్దకు వచ్చే మహిళలతో ఆ ఉద్యోగి డబుల్ మీనింగ్ మాటలతో మాట్లాడడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. అందిరితోనూ ఆ ఉద్యోగి ఇలానే మాట్లాడుతున్నారని మహిళలు వాపోతున్నారు. తనకు నచ్చినట్లు వ్యవహరించకుంటే మరోలా ఇబ్బందిపెట్టడం, ఒత్తిడి తెచ్చే మాటలు మాట్లాడుతున్నారని ఓ మహిళ తన ఆవేదనను సాక్షితో పంచుకున్నారు.
మరో అధికారిపై ఆరోపణలు..
ఇదే కార్యాలయంలో మరో ప్రధాన ఉద్యోగిగా పనిచేస్తున్న వ్యక్తిపైన ఆరోపణలున్నాయి. ఆయనపై వేధింపుల ఆరోపణలు కాకుండా ఆర్థిక లావాదేవీల్లోని లోటుపాటులను గుర్తించి సొమ్ము చేసుకునేందుకు నిత్యం ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. డీఫాల్టర్లుగా ముద్రపడిన వారు, ఇతర ఖర్చుల నుంచి దండుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారనే విమర్శలున్నాయి.
ఉన్నతాధికారులకు ఫిర్యాదులు
ఆ ఉద్యోగితో సత్సంబంధాలు కొనసాగించే మహిళల ఆధారంగా మిగిలిన వారిని ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులున్నాయి. చెప్పినట్లు వినకుంటే అతను తనదైన శైలిలో వేధింపులకు గురిచేస్తున్నారు. అందరి ఎదుట తిట్టడం, బెదరించడం వంటివి చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో కొందరు ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నం చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో కార్యాలయంలోకే మటన్, చికెన్ వెరైటీలతోపాటు చేపల పులుసులను తీసుకొచ్చి ఆయనకు వడ్డిస్తున్నట్లు అక్కడి సిబ్బంది చెబుతున్నారు. రోజూ కార్యాలయం విందు పసందులతో రంజుగా ఉంటోంది. మధ్యాహ్నం అయితే ఆ ఉద్యోగి ఛాంబర్‌లో వంట వడ్డించే వారు మినహా ఎవరూ ఉండకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇలా అనేక ఆరోపణలతో ఆ ఉద్యోగిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రాతపూర్వకంగా ఫిర్యాదులు అందడంతో పైస్థాయి అధికారులు ఆ ఉద్యోగిని తొలగించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇది చదవండి : దిగరా నాయనా.. నీ ‘పెళ్లి’ తప్పక చేస్తాం..!!
Comments
Please login to add a commentAdd a comment