రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్‌ను నిర్బంధించి దూషించిన వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌లో ఫిర్యాదు దాఖలైంది.
అమరావతి బ్యూరో: రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంను నిర్బంధించి దూషించిన టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని), ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఎమ్మెల్యే బొండా ఉమాపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌లో ఫిర్యాదు దాఖలైంది. నిబంధనలను ఉల్లంఘించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ ట్రావెల్స్‌పై కఠిన చర్యలకు ఆదేశించాలని కూడా ఆ ఫిర్యాదులో కోరారు.
కృష్ణా జిల్లా హనుమాన్‌జంక‌్షన్‌కు చెందిన సామాజిక కార్యకర్త ఎం.సుబ్రమణ్యం రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. తాము చెప్పినట్లుగా తప్పుడు నివేదికలు ఇవ్వనందునే రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంను ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు వేధించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ వల్ల ఎంతోమంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని కూడా ఫిర్యాదు చేశారు. రవాణా శాఖ అధికారుల ప్రాణాలకు రక్షణ లేకుండాపోయిందని, వారికి తగిన రక్షణ కల్పించి ప్రైవేటు ట్రావెల్స్‌పై కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని ఆయన కోరారు.