పచ్చని పంటపొలాలతో విలసిల్లే వీణవంక మండలంలో ప్రతీకార జ్వాలలు ఎగసిపడుతున్నాయి. సున్నితమైన మండలంగా రికార్డుల్లో చోటు దక్కించుకున్న ఈ ప్రాంతం ఇటీవల జిల్లాలోనే అతి సమస్యాత్మకంగా మారింది. రాజకీయ కక్షలు, భూవివాదాలు, ప్రేమకలాపాలకూ హత్యలనే ఆయుధాలుగా ఎంచుకుంటుండడంతో ఇక్కడ ఫ్యాక్షన్ పగలు కోరలు చాస్తున్నాయి. మూడు నెలల్లోనే మూడు భీకరమైన హత్యలు, రెండు అనుమానాస్పద మరణాలు, బీభత్సమైన సంఘటనలు, గతేడాదిలో రెండు హత్యలు స్థానికంగా వణుకు పుట్టిస్తున్నాయి. మండలంలోని నర్సింగాపూర్ మాజీ ఎంపీటీసీ ఉయ్యాల బాలరాజు హత్యను మరవకముందే తాజాగా బుధవారం అర్ధరాత్రి అయిలాబాద్‌కు చెందిన తాటి చంద్రయ్యనుకొందరు అగంతకులు బీరు సీసాలతో పొడిచి చంపడం మరోసారి సంచలనం రేకెత్తించింది.
ఫ్యాక్షన్ కక్షలకు బలి
ఈ నెల 5న రాజకీయకక్షలతో నర్సింగాపూర్ మాజీ ఎంపీటీసీ ఉయ్యాల బాల్‌రాజును ప్రత్యర్థులు గొడ్డలతో దారుణంగా నరికి చంపారు. ఇది ఆ గ్రామ సర్పంచ్ జడల రమేష్, అతని బావమరిది, మరో వ్యక్తి చేసిన హత్యగా పోలీసులు నిర్ధారించారు. వీరికి ఆశ్రయం ఇచ్చాడని సీపీఐ జిల్లా మాజీ కార్యద ర్శి మర్రి వెంకటస్వామిపై, కుట్ర పన్నాడని మాజీ దళ కమాండర్ పోశమల్లుపై కేసు నమోదు చేశారు. ఇలా మండలంలో ఏదో ఒక సంఘటనతో ప్రజలు భయబ్రాంతుకు గురవుతున్నారు.
పోలీసులు ఏం చేస్తున్నారో!
మావోయిస్టు ప్రాబల్యంలో వీణవంక మండల ం చాలా సంఘటనలకు చిరునామాగా నిలిచింది. ఆ తర్వాత రెండేళ్ల వరకు స్తబ్ధుగానే ఉంది. ఇటీవల కాలంలో జరుగుతున్న హత్యలు, అనుమానాస్పద మరణాలు స్థానికంగా బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇది పోలీసుల పాత్రపై అనుమానం రేకెత్తిస్తున్నాయి. మామిడాలపల్లిలో హత్యకు గురైన వెంకటేశ్వర్లు సంఘటనలో భారీమొత్తం చేతులు మారాయనే నేపథ్యంలో లోకాయుక్త, హెచ్‌ఆర్‌సీలో పోలీసులపై ఫిర్యాదులు అందాయి. మిగతా సంఘటనల్లో మాత్రం పోలీసులు వెంటనే స్పందించి నిందితులను అరెస్టు చేస్తున్నా.. వరుస ఘటనలు అంతుబట్టకుండా ఉన్నాయి. సివిల్ తగాదాలు, భూముల పంచాయతీలు, బందోబస్తుకే ఎక్కువ సమయం కేటాయిస్తున్న పోలీసులు.. శాంతిభద్రతలపై గ్రామాల్లో అవగాహన కల్పించకపోవడం ఇలాంటి సంఘటనలకు కారణమనే అభిప్రాయాలున్నాయి. హత్యకేసులలో నిందితులుగా పేర్కొంటూనే చార్జీషీటులో లొసుగులకు సహకరిస్తున్నందునే నిందితులు శిక్షల నుంచి బయటపడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పెరుగుతున్న పగలు
పచ్చని మండలంలో ఇలాంటి హత్యలు ఫ్యాక్షన్‌ను తలపిస్తున్నాయి. మాజీ ఎంపీటీసీ బాలరాజుది రాజకీయ కక్షలతో చేసిన హత్యగా పోలీసులే నిర్ధారించారు. ఇనుపచువ్వలు, గొడ్డళ్లతో చంపడం ఫ్యాక్షన్‌కక్షలకు అద్దం పట్టింది. చల్లూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులు రూ.50వేలకు కాంట్రాక్ట్ మర్డర్ చేయడం సంచలనమైంది. తాజాగా బుధవారం తాటి చంద్రయ్యను సైతం బీరుసీసాలతోనే హత్య చేయడం బీభత్సం సృష్టించింది.
వేధింపులకు అబల బలి
డిసెంబర్ 15న అత్తింటివారి వేధింపులతో మామిడాలపల్లికి చెందిన ఎడ్ల కవిత అనుమానాస్పద స్థితిలో ఊరేసుకుని మృతి చెందింది. ఇది గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఇంకా మిస్టరీయే..
2012 నవంబర్ 22న అర్ధరాత్రి మామిడాలపల్లిలోని వేంకటేశ్వరాలయంలో నిద్రిస్తున్న జోగు వెంకటేశ్వర్లు అనే భక్తుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపారు. ఈ కేసు ఇప్పటికీ వీడలేదు. మృతుని కుటుంబసభ్యులు మాత్రం కేసును పోలీసులే తప్పుదోవ పట్టిస్తున్నారని ఇటీవల హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు.
అనుమానమే..!
డిసెంబర్ 4న కనపర్తిలో ప్రేమ వేధింపులతో బీఫార్మసీ విద్యార్థిని కర్నె నవీన అనుమానాస్పద స్థితిలో వ్యవసాయ బావిలో శవమై తేలింది. ఈ సంఘటనకు అదే గ్రామానికి చెందిన యువకుడే కారణమని ఆరోపణలు ఉన్నాయి.
వరుస సంఘటనలు
1992లో అప్పటి పీపుల్స్‌వార్ పార్టీ ప్లీనరీ సమావేశాలను అప్పటి మంథని ఏరియా దళ కమాండర్ రామన్న, మానేరు ఏరియా దళ కమాండర్ గోపన్న ఆధ్వర్యంలో అచ్చంపల్లిలో నిర్వహించింది. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన పక్కా సమాచారం మేరకు పోలీసులు కాల్పులు జరిపారు. ఎదురుకాల్పుల్లో 8 మంది నక్సలైట్లు, ముగ్గురు బీఎస్‌ఎఫ్ జవాన్లు, షెల్టర్ ఇచ్చిన ఇంటి యజమాని రాజిరెడ్డి మృతిచెందారు. ఇది దేశంలోనే అతి పెద్ద ఎన్‌కౌంటర్.
ఏడాది తిరగకముందే 1993లో అదే గ్రామంలో ఇన్‌ఫార్మర్ నెపంతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు పాపిరెడ్డి, అతడి కుమారుడు మహిపాల్‌రెడ్డి, ఆలేటి మహేందర్‌రెడ్డిని ఉగాది పండుగ రోజే పీపుల్స్‌వార్ పార్టీ మంథని ఏరియా బాధ్యతలు తీసుకున్న పద్మక్క ఆధ్వర్యంలో కాల్చి చంపింది. ఇది జిల్లాలో సంచలనం రేపింది.
1995 ప్రాంతంలో ఇదే పల్లెకు చెందిన పత్రికా విలేకరి అలిగివెళ్లి రవీందర్‌రెడ్డి తెలంగాణ జన సభలో చురుకైన కార్యకర్తగా ఎదుగుతున్నాడు. కల్వల ప్రాజెక్ట్ నిర్మాణం కోసం 32 రోజులు తీవ్ర ఉద్యమాన్ని చేపట్టాడు. జనసభలో అంచెలంచెలుగా ఎదుగుతున్న తరుణంలో 2001 అగస్టులో మెదక్ జిల్లా సిద్దిపేటలో దుండగులు సజీవ దహనం చేశారు. ఇది రాజకీయ హత్యేనని అప్పట్లో ఆరోపణలు వెల్లువడ్డాయి. ఆ కేసు నేటి వరకు మిస్టరీ వీడలేదు.
2008లో కనపర్తిలో పట్టపగలే అందరూ చూస్తుండగానే ఆస్తి కోసం పరమేశ్వర్ అనే వ్యక్తి సొంత బావమరిది భార్య కొండూరి శ్రీలత, ఆమె కుతురు సంతోషి(12)ని గొడ్డలితో దారుణంగా హత్య చేశాడు.
మూడేళ్ల క్రితం బొంతుపల్లిలో కొడుకులు పోషించడం లేదని మనస్తాపంతో వృద్ధుడు చదువు వెంకట్రామిరెడ్డి తానే చితి పేర్చుకుని నిప్పంటించుకున్నాడు. ఈ సంఘటనపై అప్పట్లో ఓ మంత్రి అసెంబ్లీలో చర్చించారు. ఇది ప్రతి ఒక్కరి హృదయాలను కలిసివేసింది.
ఇప్పలపల్లిలో గతేడాది మంత్రాల నెపంతో సొంత నానామ్మను మనుమడు తిరుపతి రోకలిబండతో అతికిరాతకంగా హత్య చేశాడు.
డిసెంబర్ 27న చల్లూరుకు చెందిన శ్రీనివాసరెడ్డి, రమేశ్ కలిసి రూ.50వేల కాంట్రాక్టుకు వరంగల్ జిల్లా మొగుళ్లపల్లి మండలం పర్లపల్లికి చెందిన బొల్లు రణధీర్‌రెడ్డి అనే యువకుడిని దారుణంగా హత్య చేసి కాల్చివేశారు.
పచ్చని పల్లెల్లో నెత్తుటేరులు
Published Fri, Jan 24 2014 1:45 AM | Last Updated on Tue, Oct 16 2018 2:39 PM
Advertisement
Advertisement