‘రూ.100కే కుళాయి కనెక్షనిస్తాం. బీపీఎల్ కుటుంబాలన్నీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఏడాది కాలంలో నగర పరిధిలో సుమారు 12 వేల కుటుంబాలకు నీటి వసతి అందిస్తాం’ అంటూ ప్రకటనలు గుప్పించిన జీవీఎంసీ యంత్రాంగం అమల్లో చతికిలపడింది. జీవీఎంసీలో విలీనమైన అనకాపల్లి, భీమునిపట్నంలోని అధికారులు మంజూరు చేసిన స్థాయిలో కూడా కుళాయి కనెక్షన్లు ఇవ్వలేదు.
నిధులు రాలేదట!
13వ ఆర్థిక సంఘ నిధుల్లో భాగంగా దారిద్య్ర రేఖకు దిగువనున్న(బీపీఎల్) కుటుంబాలకు ఉచితంగా కుళాయి కనెక్షన్లు మంజూరు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.1200 డిపాజిట్‌తో బీపీఎల్ కుళాయి కనెక్షన్లు ఇస్తున్నారు. ఉన్నఫళంగా డిపాజిట్ లేకుండా, అన్ని పరికరాలు ఉచితంగా అందించడం ఆర్థిక భారమవుతుందని ప్రభుత్వానికి జీవీఎంసీ గతంలో నివేదించింది. దీంతో ఆ మొత్తం 13వ ఆర్థిక సంఘ నిధులతో సర్దుబాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
ఈ మేరకు నగర పరిధిలో సుమారు 12 వేల కుళాయి కనెక్షన్లు రూ.100కే అందించనున్నట్టు జీవీఎంసీ ప్రకటించింది. ఇందుకు రూ.2.36 కోట్లు ఆర్థిక సంఘ నిధులకు ప్రతిపాదనలు పంపింది. కానీ ఇప్పటి వరకు ఈ విభాగంలో సుమారు 200 కనెక్షన్లకు మించి మంజూరు చేయలేదని అధికారులు చెప్తున్నారు. ఆ 200 కనెక్షన్లు కూడా గతంలో ఉన్న బీపీఎల్ నిబంధనలనే కాస్త సవరించి, కనెక్షన్ మంజూరు సమయంలో రూ.100 చెల్లించి, తర్వాత నెలకు రూ.100 చొప్పున 11 నెలలు చెల్లించాలని ఆదేశించారు. ఆర్థిక సంఘ నిధులు విడుదలైతే.. మిగిలిన 11 నెలల మొత్తాన్ని.. తర్వాతి నీటి చార్జీల బిల్లులో సర్దుబాటు చేస్తామని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఆ విభాగంలో ఒక్క రూపాయీ జీవీఎంసీకి రాలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.