
తప్పుచేసి తప్పించుకోవాలని చూడటం... నెపం వేరే వారిపైకి నెట్టేయడం... టీడీపీ నేతలకు అలవాటైపోయింది. అధినేత నుంచి దిగువస్థాయి వరకూ ఈ తీరును ఎంచక్కా వంటపట్టించుకున్నట్టుంది. బహిరంగంగా ఓ వ్యక్తిపై అందరూ చూస్తుండగా దాడిచేసి... మెడపట్టి గెంటేసి... తీరా రెండు రోజుల్లోనే అదంతా విపక్షాల కుట్ర అంటూ ఆ బాధితుడిచేతే చెప్పించడం వారి వంచనకు పరాకాష్ట. ఇదే అసలైన రాజకీయం అనుకుంటున్నారో... జరిగిన విషయం జనం మర్చిపోతున్నారని భావిస్తున్నారోగానీ... ఏ మాత్రం సంకోచించకుండా చిల్లర విధానాలు అవలంబిస్తున్నారు. పార్వతీపురంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అనుసరించిన ఈ వైఖరిపై అక్కడి జనాలు నవ్విపోతున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: అది పార్వతీపురం ఒకటో వార్డు. గురువారం ఉదయం సరిగ్గా పది గంట లవుతోంది. ఆ వీధిలో జనాన్ని కలుసుకునేందుకు టీడీపీ గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు... ఇతర నాయకులు వచ్చారు. ఆ వీధిలో నెలరోజు లుగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యపై అంతా నాయకులను ప్రశ్నించారు. అందులో పొట్నూరు హరి కృష్ణ అనే యువకుడు ఓ అడుగు ముందుకేసి కాస్త గట్టిగానే బురదనీరు ఎలా తాగాలంటూ నిలదీశారు. అంతే ఒక్కసారిగా కోపోద్రిక్తుడైన ఎమ్మెల్సీ జగదీష్ ఆ విషయం అడగడానికి నువ్వెవడివంటూ... ఆ యువకుడిపైకి దూసుకొచ్చి మెడపట్టి తోసేశాడు.
అనుకోని సంఘటనతో వీధిలోని మహిళలు, పెద్దలు ఒక్కసారిగా హతా శులయ్యారు. తేరుకుని ఇరువర్గాలను సర్దిచెప్పి అక్కడినుంచి పంపించేశారు. కానీ దెబ్బలు తిన్న ఆ బాధితుడు మీడియాతో మాట్లాడాడు. తనపై అకారణంగా ఎమ్మెల్సీ జగదీష్, ఆయన అనుచరుడు చేయిచేసుకున్నారంటూ చెప్పారు. అంతేగాదు... దీనిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. సీన్ కట్ చేస్తే... శనివారం ఉదయం పార్వతీపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో కలసి హరికృష్ణ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. గురువా రం తాను చెప్పిందంతా తూచ్ అని కొట్టిపారేశాడు. ఇదంతా ప్రతిపక్ష రాజకీయాల్లో భాగంగానే జరిగిందని చెప్పుకొచ్చాడు.
ఆరోజుకు... ఈ రోజుకు... మధ్య ఏం జరిగిందనేది ఎవరైనా ఇట్టే అర్థం చేసుకోగలరు. బహుశా ఎన్నికలు సమీపిస్తున్న వేళ తన ఇమేజ్‌కు భంగం కలుగుతుందని భావించారో... పోలీస్ కేసు నమోదైతే ఇబ్బందులు వస్తాయనుకున్నారో... లేక అధినేత అక్షింతలు వేశారో... గానీ నయానో... భయానో... ఆ యువకుడిని ఒప్పించారు. ఏమీ జరగలేదన్నట్టు ఆయనతో చెప్పించారు. ఆ రోజు దాడిని ప్రత్యక్షంగా చూసినవారు... ఈ రోజు మీడియాకు చెప్పిన విషయాన్ని తెలుసుకున్నవారు టీడీపీ కుటిల రాజకీయం, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ చర్యలపై దుమ్మెత్తిపోస్తున్నారు.
అందరి తీరూ అంతే...
అధికార పార్టీలో అందరి తీరూ అంతేనని గతంలో జరిగిన సంఘటనలూ రుజువు చేస్తున్నాయి. మొన్నటికి మొన్న మంత్రి సుజయ్ కూడా అలా నే ప్రవర్తించారు. బొబ్బిలి మండలం మల్లంపేట గ్రామంలో సర్వే నెం247/2లోని 15.90 ఎకరాలకు భూ పరిమితి చట్టం నుంచి కోర్టు ద్వారా మినహాయింపు పొందిన ఆయన తమ పూర్వీకులు నాలుగు దశాబ్దాల క్రితం భూపరిమితి చట్టం ప్రకారం ఎక్కువగా ఇచ్చేశామనుకుంటున్న గొల్లపల్లి రెవెన్యూ గ్రామంలో సర్వే నెం.45లో ఉన్న ఎనిమిది ఎకరాలను అధికారాన్ని అడ్డుకుపెట్టుకుని స్వాధీనం చేసుకోవాలనుకున్నారు. అయితే భూములు కాపాడుకోవడం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించిన గిరిజన రైతులను తన బంగ్లాకు రప్పించి బెదిరించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు.
ఇటీవల రామభద్రపురం మండలంలోని శిష్టు సీతారాంపురంలో 43 ఎకరాల సాగు భూమి 57 మంది లబ్ధిదారులకు భూ పంపిణీ చేయాలనే ప్రతిపాదనను ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. ఈ భూముల్లో ప్రస్తుతం ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న ప్రైవేటు వ్యక్తుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా రూ.14 లక్షలకు కొనుగోలు చేసేశారు.
ఆ మేరకు టీడీపీ పెద్దలు భారీ ప్లాన్‌వేశారు. వారి పన్నాగం వెలుగులోకి రావడంతో అమాయక దళితులకు మాయమాటలు చెప్పారు. వారి మాటలు ఖాతరు చేయని వారిని బెదిరిం^ éరు. వారికి జరుగుతున్న అన్యాయంపై అండగా నిలవడానికి వెళ్లిన విపక్షనాయకులకు వ్యతిరేకంగా అదే దళితుల చేత నినాదాలు చేయించా రు. అయితే ప్రతిపక్షం చేసిన ఆరోపణల్లో నిజాలు ఉండటంతో నేటికీ ఆ భూముల పంపకాలను చేపట్టకుండా అక్కడితో ఆగిపోయారు. ఇలా తమకు ఎదురుచెబుతున్న వారిని, తమను నిలదీస్తున్నవారినీ బెదిరించి దారికి తెచ్చుకోవడం టీడీపీ నేతలకు అలవాటుగా మారింది. తమ అధినేత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా, ప్రశ్నించిన జనంపైనే అమరావతిలో ఎదురుదాడి చేయడాన్ని జిల్లా నేతలు వంటబట్టించుకున్నారు. ఇక రానున్న రోజుల్లో పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందోనని ప్రజలు భయపడుతున్నారు.