జోరుగా ఎర్రచందనం అక్రమ రవాణా
అధికార పార్టీ నేతలకు అభయమిస్తున్న డివిజన్ పోలీస్ బాస్
బెయిల్‌పై బయటకు వచ్చిన డాన్‌లు
బదానీ విచారణలో పలు ముఖ్య నేతల పేర్లు
మైదుకూరు టౌన్ : ‘ఎర్ర’దొంగలపై ఖాకీలు కన్నెర్ర చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణను అడ్డుకునేందుకు నడుంబిగించారు. స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న వారి జాబితాను సిద్ధం చేసి అరెస్టు చేసేందుకు ప్రణాళిక రచించారు. ఇప్పటికే కొందరిని అరెస్టు చేయగా, మిగతా వారిని అదుపులోకి తీసుకుందుకు పక్కా ప్రణాళికతో వెళుతున్నారు. అయితే దొంగల జాబితాలో టీడీపీ నేతలు అధికంగా ఉండటంతో.. పోలీసులపై అధికార పార్టీ నేతల నుంచి ఒత్తిళ్లు అధికమయ్యాయి.
డాన్ తన పాత పేరు నిలుపుకునే యత్నం:
ప్రపంచలో ఎక్కడా లేని అత్యంత అరుదైన, విలువైన ఎర్రచందనం వనాలు శేషాచలం, నల్లమల అటవీ ప్రాంతంలో వేలాది హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి. కొన్నేళ్లుగా ‘అడవి దొంగలు’ ఈ వృక్షాలను తెగనరికి విదేశాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే పలు ఎర్రచందనం కేసుల్లో స్మగ్లింగ్‌కు పా ల్పడి డాన్ పేరు తెచ్చుకొని పీడీ యాక్ట్ నమోదైన వ్యక్తి ఇప్పుడు మళ్లీ తన పాత పేరును నిలుపుకునేందుకు అధికార పార్టీ నాయకులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.
అలాగే జాండ్లవరం సమీపంలో ఓ సామాజిక వర్గానికి చెందిన నాయకుడి నుంచి కొన్ని రోజుల క్రితం ఫారెస్ట్ అధికారులు రెడ్‌హ్యాండ్‌గా ఎర్రచందనం దుంగలను, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే అతనిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకొన లేదు. వాహనాన్ని కూడా తిరిగి ఇచ్చేశారు.
ఎక్కువ శాతం టీడీపీ వర్గీయులే:
బద్వేలు పట్టణంలోని ఓ ప్రముఖ స్మగ్లర్ ఇప్పటికే అధికార పార్టీ నాయకుడిని కలసి తన కార్యకలాపాలను యథేచ్ఛగా నడుపుతున్నాడు. మైదుకూరు మండలంలో ఎర్రచందనం కేసులో పట్టుబడ్డ వారు ఎక్కువ శాతం టీడీపీ వర్గీయులే. బద్వేలు పోలీస్‌స్టేషన్‌లో ఇంటర్నేషనల్ డాన్ ముఖేష్‌బదానీని అరెస్ట్ చేసి, అతని వద్ద సమాచారం రాబట్టారు. ఇందులో టీడీపీ కీలక నాయకుల పేర్లు బయటకు వినిపిస్తున్నాయి.
మైదుకూరు సబ్‌డివిజన్ పరిధిలోని పోరుమామిళ్ల, జాండ్లవరం, నాగసానుపల్లెకు చెందిన బడా స్మగ్లర్ల పేర్లు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ఈ గ్రామాల్లోని వారు అధికార పార్టీ నాయకుల వద్దకు వెళ్లి తమకు మీరే దిక్కు సార్.. అరెస్టులు కాకుండా అడ్డుకోవాలని కోరినట్లు తెలుస్తోంది. పార్టీ కోసం భారీగా డబ్బులు ఖర్చు చేశామని, తాము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకోవాలని విన్నవించారు. దీంతో ఆయన సంబంధిత డివిజన్ బాస్‌ను కోరగా సరే అన్నట్లు సమాచారం. ‘డోంట్ వర్రీ..మై హూనా.. అరెస్టులు ఇక వేగంగా ఉండవు అన్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.
రాత్రి వేళ్లలో జోరుగా రవాణా:
ప్రభుత్వాలు ఎన్ని ఆంక్షలు పెడితే మాకేమి అభయమిచ్చిన నాయకుల అనుమతిస్తే చాలు ఇక ఎర్రచందనం ఎక్కడికైనా అట్లే పంపించవచ్చు అన్నట్లు ఆ బడా స్మగ్లర్లు రాత్రి సమయంలో విచ్చలవిడిగా తరలిస్తున్నారని సమాచారం. అసలైన స్మగ్లర్లను శిక్షించి విలువైన ఎర్రచందనం కాపాడాల్సిన బాధ్యత జిల్లా పోలీస్ బాస్‌పై వుంది. ఆయన ఎంత వరకు దృష్టి సారిస్తారో వేచి చూడాలి.
డోంట్ వర్రీ.. మై హూనా ..!
Published Mon, Jun 8 2015 2:32 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement