యథేచ్ఛగా తమ్ముళ్ల భూ కబ్జాలు !!
దర్శి: తెలుగు తమ్ముళ్ల అక్రమాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. కనిపించిన కాడికి ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని అక్రమంగా దున్నుకోవడం, మేమున్నామంటూ భరోసా ఇచ్చి ఆ భూములను ఇంకొకరికి అమ్ముకోవడం మామూలైంది. ఫిర్యాదుదారులు వెళ్లి చెప్పినా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు.
దర్శి మండలంలోని బొట్లపాలెం గ్రామం 370 సర్వే నంబరులో 70 ఎకరాల పశువుల పోరంబోకు భూమిని ఆక్రమించుకోవడానికి తెలుగు తమ్ముళ్లు రంగం సిద్ధం చేసుకున్నారు. సాగర్ కాలువ సమీపంలోనే ఆ భూమి ఉండటంలో దాని విలువ పెరిగింది. దీంతో ట్రాక్టర్లతో దున్నుకోవడం మొదలుపెట్టారు. వీటితో పాటు 357/2 సర్వే నంబర్‌లో 657 ఎకరాల భూమి ఉండగా అందులో ఎస్సీలకు 170, బీసీ లకు 124 ఎకరాలకు గతంలో పట్టాలు ఇచ్చారు. మిగిలిన 363 ఎకరాల్లో 70 ఎకరాలు 22 మంది పేర్లతో పట్టాలున్నాయంటూ ఆక్రమించుకుని అమ్ముకోవడానికి నకిలీ పత్రాలు సృష్టించి గతంలో రంగం సిద్ధం చేసుకున్నారు. ఆర్డీవోకు ఈ విషయం తెలిసి ఆ పత్రాలను రద్దు చేసి భూమి లేని పేదలకు అందజేయాలని అప్పటి తహశీల్దార్‌ను ఆదేశించారు.
మిగతా 293 ఎకరాల్లో కొంత ఆక్రమణలకు గురికాగా, కొంత భూమి ఆక్రమణదారుల కనుసన్నల్లో ఉంది. బొట్లపాలెం గ్రామం ఆనుకుని గంగవరం వెళ్లే ప్రధాన రోడ్డుకు ఇరువైపులా ఉన్న 612 సర్వే నంబరులో 90 ఎకరాలు భూమి ఉండగా ఇప్పటికి 80 ఎకరాలకు పైగా ఆక్రమణదారుల చేతుల్లో ఉంది. 10 ఎకరాలు వాగులు, వంకలు మాత్రమే వదిలిపెట్టారు. 40 సర్వే నంబరులోని 140 ఎకరాల వాగు పోరంబోకు భూమిలో పంటలు వేసుకుని పండించుకుంటున్నారు. 416 సర్వే నంబరులోని బ్రహ్మంగారి గుడి వెనుక చీకటీగల దిన్నె గడ్డలోని 40 ఎకరాల భూమి కొంత ఆక్రమించుకుని సాగు చేసుకోగా కొంత బీడుగా ఉంది. ఈ భూమిని ఆనుకుని గార్లవాగుకు పడమర వైపు 40 ఎకరాలు ఆక్రమణలకు గురైంది. చెట్టు చెరువు తొట్టి వద్ద 70 ఎకరాల ప్రభుత్వ భూమిలో 40 ఎకరాలు ఆక్రమణల పాలైంది. 357/1 సర్వే నంబరులో 40 ఎకరాలు ప్రభుత్వ భూమి పూర్తిగా పరులపాలైంది.
నకిలీ పత్రాలు సృష్టించారా..?
గ్రామంలో తమకు పాస్‌పుస్తకాలు కూడా ఉన్నాయని కొందరు ఆక్రమణదారులు చెప్తున్నట్లు సమాచారం. అయితే నకిలీ పట్టాలు, నకిలీ దొంగ పాస్‌పుస్తకాలు సృష్టించినట్లు మరి కొందరు చర్చించుకుంటున్నారు. ఆ పత్రాలు ఆక్రమణ దారులకు ఇచ్చేందుకు భారీ మొత్తంలో రెవెన్యూ అధికారులకు ముడుపులు చెల్లించినట్లు సమాచారం.
భూములపై చర్యలేవీ:
ఈ ఆక్రమణలన్నీ అధికారులకు తెలియకుండానే జరుగుతున్నాయూ అనేది ప్రశ్నార్థకమైంది. ఆ గ్రామానికి చెందిన కొందరు తహశీల్దార్ దృష్టికి తీసుకెళ్లినా ఆక్రమణదారులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఫిర్యాదుదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆక్రమణదారుల నుంచి భూమిని కాపాడాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.
ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటాం
ఆక్రమణల విషయం మా దృష్టికి కూడా వచ్చింది. వీఆర్వోను తనిఖీ నిమిత్తం అక్కడికి పంపించాం. అక్కడ అలాంటిదేమీ లేదని వీఆర్వో చెప్పారు. మళ్లీ వెళ్లి తనిఖీ చేసి ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. - మస్తాన్, ఇన్‌చార్జ్ తహశీల్దార్