తమ్ముళ్లే సూత్రధారులు..!  | TDP Leaders Running Banned Gutka Mafia In Prakasam District | Sakshi
Sakshi News home page

తమ్ముళ్లే సూత్రధారులు..! 

Published Sun, Aug 25 2019 10:10 AM | Last Updated on Sun, Aug 25 2019 10:10 AM

TDP Leaders Running Banned Gutka Mafia In Prakasam District - Sakshi

గుట్కా ప్యాకెట్ల తయారీ కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌  

అధికారంలో ఉన్న ఐదేళ్లు అక్రమాలు, అసాంఘిక కార్యకలాపాలకు అలవాటు పడిన టీడీపీ నేతలు అధికారం కోల్పోయినా తీరు మార్చుకోవడం లేదు. సహజ వనరులను కొల్లగొట్టడం, సంపదను దోచుకోవడంతో ఆగక ప్రజారోగ్యంతోనూ చెలగాటమాడుతున్నారు. ఆరోగ్యానికి హాని కలిగించే నిషేధిత గుట్కా తయారీ కేంద్రాన్ని శుక్రవారం పోలీసులు మేదరమెట్లలో గుర్తించిన విషయం తెలిసిందే. అయితే గుట్కా మాఫియాను నడుపుతున్నది మాత్రం టీడీపీ నేతలే అనేది స్పష్టమవుతోంది. గుట్కా తయారీ కేంద్రాన్ని నడుపుతున్న నెల్లూరు జిల్లాకు చెందిన బలగాని ప్రసాద్‌ కేవలం పాత్రధారి మాత్రమేనని సూత్రధారులంతా టీడీపీ ఎమ్మెల్యే అనుచరులేననే చర్చ జరుగుతోంది. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కొందరు పోలీసు అధికారుల అండదండలతో స్థానిక టీడీపీ నేత హనుమంతరావుకు చెందిన గోడౌన్‌లో గుట్కా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పోలీసు అధికారులకు పెద్ద మొత్తంలో నెలవారీ మామూళ్లు ఇస్తూ తమ పని చక్కబెట్టుకుంటున్నారు. గుట్కా తయారీ కేంద్రం గుట్టు రట్టు కావడంతో టీడీపీ నేతలు తమకేమీ సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నాలకు తెరతీశారు.

సాక్షి, ఒంగోలు : కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో మూడేళ్ల క్రితం స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు నలుగురు కలిసి గుట్కా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సాంకేతిక పరమైన అంశాలను చూసుకుంటూ నిర్వహణ బాధ్యతలు చూసుకునేందుకు నెల్లూరు జిల్లకు చెందిన బలగాని ప్రసాద్‌ అనే వ్యక్తిని నియమించారు. అప్పట్లో అక్కడ పనిచేసిన ఎస్సైతో పాటు ఎస్‌బీ అధికారులకు సైతం తెలిసే గుట్కా తయారీ కేంద్రం ఏర్పాటు చేసినట్లు సమాచారం. నెలకు రూ.2 లక్షల చొప్పున పోలీసులకు మామూళ్లు ముట్టచెప్పి అక్రమ వ్యాపారాన్ని నిర్వహిస్తూ వచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేతో దగ్గరగా ఉండే మార్కెట్‌యార్డు మాజీ వైస్‌ చైర్మన్‌తో పాటు హనుమంతరావు (బుల్లబ్బాయ్‌), గ్రామానికి చెందిన ఇద్దరు టీడీపీ నేతలు భాగస్వామ్యంతో గుట్కా తయారీ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ ద్వారా ఎస్సై నుంచి డీఎస్పీ స్థాయి అధికారి వరకు నెలవారీ మామూళ్లు ఇస్తూ హనుమంతరావుకు చెందిన గోడౌన్‌లో గుట్టుగా గుట్కా తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. రాత్రి వేళల్లో గుట్కాను ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా చేసేందుకు కూడా అప్పట్లో పని చేసిన ఎస్‌బీ అధికారులు వీరికి పూర్తి స్థాయిలో అండదండలు అందించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుట్కా తయారీ కేంద్రం ద్వారా అడ్డగోలుగా సంపాదించిన టీడీపీ నేతలు గ్రామాల్లో పెద్ద పెద్ద ఇళ్లు నిర్మించడమే కాకుండా 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ ఎమ్మెల్యేకు చందాలు కూడా ఇచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

కేసు నుంచి తప్పించాలంటూ భారీ ఆఫర్లు..
గుట్కా తయారీ కేంద్రానికి వచ్చి రూ.3కోట్ల విలువ చేసే యంత్రాలు, తయారీ పదార్థాలను స్వాధీనం చేసుకున్న జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్‌ అక్కడే విలేకరుల సమావేశం నిర్వహించి నిందితులను వదిలేది లేదని స్పష్టం చేశారు. అయితే తాను బలగాని ప్రసాద్‌కు గోడౌన్‌ను లీజకు ఇచ్చానేతప్ప తనకేమీ సంబంధం లేదని టీడీపీ నేత హనుమంతరావు తప్పించుకునే యత్నం చేస్తున్నాడు.  బలగాని ప్రసాద్‌ ఒక్కడే గుట్కా తయారీ కేంద్రాన్ని నడుపుతున్నట్లుగా చూపి తమ పేర్లు తొలగించాలంటూ టీడీపీ నేతలు ఓ పోలీసు అధికారికి భారీ మొత్తం ఆఫర్‌ చేసినట్లు సమాచారం. దీంతో విచారణ అధికారులకు, ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇస్తూ కేసు నుంచి టీడీపీ నేతలను తప్పించేందుకు సదరు పోలీసు అధికారి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లోతుగా విచారణ జరిగితే తమ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయోననే భయంతో గతంలో గుట్కా మాఫియాకు అండదండలు అందించిన పోలీసు అధికారులు సైతం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఎస్పీ గ్రామంలో రహస్య విచారణ జరిపితే కళ్లు చెదిరే వాస్తవాలు బయటకొస్తాయని చెబుతున్నారు. 

ఒత్తిళ్లకు తలొగ్గం.. : అశోక్‌ వర్థన్, అద్దంకి సీఐ 
గుట్కా తయారీ కేంద్రం కేసు విషయంలో జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కేసులో సంబంధం ఉన్న ఏ ఒక్కరినీ వదిలేది లేదు. ఇప్పటికే గోడౌన్‌ యజమాని హనుమంతరావును అరెస్టు చేశాం. ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా కేసులో ముందుకు వెళ్తాం. 

గోడౌన్‌ యజమాని అరెస్ట్‌... కోర్టుకు తరలింపు
మేదరమెట్ల: కొరిశపాడు మండలంలోని మేదరమెట్ల గ్రామంలో నిషేధిత ఖైనీ, గుట్కా తయారీ కేంద్రానికి అద్దెకు ఇచ్చిన గోడౌన్‌ యజమాని పోకూరు హనుమంతరావును శనివారం మేదరమెట్ల పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్సై బాలకృష్ణ తెలిపారు. శుక్రవారం వెలుగు చూసిన నిషేధిత ఖైనీ, గుట్కా తయారీ కేంద్రం గుట్టు రట్టు అయిన సందర్భంగా గోడాన్‌ యజమానిపై 420, 468, 174,328,188,466,471,120బీ, 272 మరియు 59 సెక్షన్లపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నామని ఎస్సై తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement