ఎన్నికల సందర్భంగా రుణాలు మాఫీ చేస్తామని, బ్యాంకుల్లో పెట్టిన బంగారం తీసుకువస్తామని చంద్రబాబు, తెలుగుదేశం నాయకులు మభ్యపెట్టారు.
► గడప గడపకూ వైఎస్సార్‌లో గిరిజనుల ఆవేదన
బుట్టాయగూడెం: ఎన్నికల సందర్భంగా రుణాలు మాఫీ చేస్తామని, బ్యాంకుల్లో పెట్టిన బంగారం తీసుకువస్తామని చంద్రబాబు, తెలుగుదేశం నాయకులు మభ్యపెట్టారు. మండలంలోని చిన్నజీడిపూడి, డ్యామ్ కాలనీకి చెందిన ప్రజలు మంగళవారం జరిగిన గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బాబు ఎన్నికల్లో చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తారని ఆశపడ్డామని చెప్పారు.
అయితే మూడేళ్లు గడచినా అవి అమలు కాకపోవడంతో ఎన్నికల్లో బాబు ఇచ్చిన హామీలన్నీ మాయే అంటూ ఇప్పుడు తెలుసుకుని బాధ పడుతున్నామంటూ మొడియం దుర్గారావు, ఎస్. సత్యవతి, కె. లింగయ్య తెలిపారు. డ్వాక్రా సంఘాల రుణాలు కట్టవద్దని చెపితే ఆగామని ఇప్పుడు అసలు, వడ్డీ కోసం బ్యాంకుల వారు తమను ఇబ్బంది పెడుతున్నారంటూ మహిళలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తమ దగ్గరకు వచ్చి టీడీపీ నాయకులు ఎలా ఓట్లు అడుగుతారో చూస్తామంటూ గిరిజన మహిళలు తీవ్రంగా హెచ్చరించారు.
అలాగే ఇల్లు మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకుండా పోతుందని కాకడ వెంకటేశ్వరరావు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆరేటి సత్యనారాయణ, మద్దిపాటి సూరిబాబు, ఎంపీటీసీలు తెల్లం రమణ, కూరం ముత్యాలమ్మ, వెట్టి పెంటమ్మ, నాయకులు శంకారపు శ్రీను, సోయం వెంకట్రామయ్య, తెల్లం రాముడు, మడకం చలపతిరావు, సోదెం వెంకటేశ్వరరావు, కూరం రాంబాబు, తెల్లం గంగరాజు తదితరులు పాల్గొన్నారు.