సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజలందరికీ గృహ వసతి కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని టీడీపీ సర్కారు తుంగలోకి తొక్కింది. ఇళ్లు నిర్మించి ఇవ్వడం మాట దేవుడెరుగు కనీసం జానెడు ఇంటి స్థలమైనా ఇచ్చేందుకు నిరాకరిస్తోంది. గూడులేని పేదల అర్జీలను రకరకాల కొర్రీలతో తిరస్కరించి పక్కన పడేస్తోంది. నివాస స్థలాలు మంజూరు చేయాలంటూ 19.82 లక్షల అర్జీలు రాగా రెండొంతులకుపైగా చెత్తబుట్ట పాలయ్యాయి. దాదాపు 13.67 లక్షల అర్జీలను తిరస్కరించిన సర్కారు 6.15 లక్షల మంది మాత్రమే ఇళ్ల పట్టాల మంజూరుకు అర్హులని తేల్చింది. అయితే వీరికి కూడా పట్టాలు ఇవ్వడానికి సర్కారుకు చేతులు రావడం లేదు.
సర్వే సాకుతో తిరస్కరణ..
ఇళ్ల స్థలాల కోసం వచ్చిన దరఖాస్తుల్లో 9.91 లక్షల అర్జీలు ఒకే కారణంతో తిరస్కరణకు గురి కావడం గమనార్హం. ప్రజాసాధికార సర్వే ప్రకారం వీరికి ఇళ్లు ఉన్నందున దరఖాస్తులను తిరస్కరించినట్లు ప్రభుత్వం పేర్కొంది. లక్షల మంది వివరాలు ఈ సర్వేలో లేవు. అలాంటప్పుడు ఈ సర్వేను ప్రామాణికంగా చేసుకుని దాదాపు పది లక్షల దరఖాస్తులను తిరస్కరించడం అన్యాయమని వాపోతున్నారు.
సర్వే సమయంలో ఉమ్మడి కుటుంబంలో ఉన్నా తరువాత కొందరికి వివాహాలు కావటంతో ఇతర చోట్ల ఉంటున్నారని గుర్తు చేస్తున్నారు. 18 ఏళ్లు నిండని వారి అర్జీలను తిరస్కరించడంపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పట్టణాల్లో చాలామంది కూలి పనులు చేసుకుంటూ కాళ్లు చాపేందుకు కూడా చాలని ఇరుకు గుడిసెల్లో జీవిస్తున్నారు. ఇలాంటి వారి వివరాలు సాధికార సర్వేలో లేవు. కరువు సమయంలో వలస వెళ్లిన కూలీల పేర్లు కూడా సర్వేలో నమోదు కాలేదు. ఇలాంటి దరఖాస్తులన్నీ తిరస్కరణ జాబితాలో చేరిపోయాయి.
కాళ్లరిగేలా తిరుగుతున్న పేదలు
ఇళ్ల స్థలాల కోసం నిరుపేదలు రెవెన్యూ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా ప్రదక్షిణలు చేస్తున్నారు. ‘మీకోసం’ గణాంకాల ప్రకారం కృష్ణా జిల్లాలో అత్యధికంగా 3.29 లక్షల మంది ఇంటి స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 2.94 లక్షలు, కర్నూలు జిల్లాలో 2.44 లక్షలు అర్జీలు వచ్చాయి. ఇళ్ల స్థలాల కోసం ప్రవాస భారతీయులు 1,555 మంది అర్జీలు పెట్టుకోగా తిరస్కరించినట్లు ప్రభుత్వం పేర్కొంది. 17,394 మంది ప్రభుత్వ ఉద్యోగులు దరఖాస్తులు సమర్పించినట్లు తెలిపింది. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో 1,28,248 అర్జీలు రాగా కేవలం 6,013 మంది మాత్రమే అర్హులని ప్రభుత్వం తేల్చింది. సిఫార్సులు ఉన్న వారి వినతులను మాత్రమే ఆమోదిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఎందుకిలా?
సింహభాగం భూములు అధికార పార్టీ నాయకుల పరం కావడం, ప్రజావసరాల కోసం నిర్దేశించిన విలువైన భూములను రకరకాల మార్గాల్లో ధారాదత్తం చేయడంతో పేదలకు కనీసం ఇంటి స్థలాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉత్పన్నమైందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ‘టీడీపీ నాయకులు గ్రామకంఠాలను కూడా కైవసం చేసుకుని ఇళ్ల స్థలాలుగా మార్చి భారీ ధరలకు విక్రయిస్తున్నారు. గత నాలుగేళ్లలో జరిగిన భూ కుంభకోణాలు ఈ దుస్థితికి కారణం’ అని వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రైవేట్ భూములే శరణ్యం..
ప్రభుత్వం అర్హులుగా నిర్ధారించిన 6.15 లక్షల మందికి ఇళ్ల జాగాల కోసం రూ.7,052.98 కోట్లు అవసరమని కలెక్టర్లు గుర్తించారు. ఇళ్ల జాగాలు ఇవ్వడానికి 14927.06 ఎకరాల భూమి అవసరమని రెవెన్యూ శాఖ తేల్చింది. అయితే 4494.26 ఎకరాల ప్రభుత్వ భూమి మాత్రమే ఇళ్ల పట్టాల మంజూరుకు అందుబాటులో ఉంది. ఇది 174464 మందికి పట్టాలు ఇవ్వడానికి సరిపోతుంది. మిగిలిన 440318 మందికి ఇంటి స్థలాల కోసం 11468.77 ఎకరాల ప్రైవేట్ భూమి సేకరించాల్సి ఉందని రెవెన్యూ శాఖ ఆర్నెళ్ల క్రితమే నివేదిక ఇచ్చినా ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా నాన్చడంతో పట్టాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని అధికార వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment