సింహభాగం సీమాంధ్ర ఖాతాలోకే
అప్పుల సరళి ఆధారంగా లెక్కలు
సాక్షి, హైదరాబాద్: గుట్టలుగా పేరుకుపోతున్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అప్పుల పంపకంపై ఆర్టీసీ అధికారులు కుస్తీ పడుతున్నారు. ప్రస్తుతం రూ.4,800 కోట్ల వరకు చేరుకున్న నష్టాలను విభజించే పనిలో నిమగ్నమయ్యారు. దీన్ని జనాభా ప్రాతిపదికన కాకుండా... రెండు ప్రాంతాల్లో నష్టాల సరళి ఆధారంగా పంచే పని ప్రారంభించారు. సోమవారం నాటికి ఈ తంతును పూర్తి చేయనున్నట్టు ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. ఆర్టీసీ ఆవిర్భవించినప్పటి నుంచి పరిశీలిస్తే గత సంవత్సర కాలంలో రికార్డు స్థాయిలో నష్టాలు నమోదయ్యాయి. ఈమేరకు గత జనవరిలో ప్రభుత్వానికి ఆర్టీసీ ఓ నివేదిక అందజేసింది. 2013 ఏప్రిల్ నుంచి ఈ సంవత్సరం జనవరి వరకు ఏకంగా రూ.648 కోట్ల వరకు నష్టాలు వచ్చినట్టు తేల్చారు.
ఒక్క జనవరిలోనే రూ.71 కోట్ల నష్టం వచ్చినట్టు అందులో పేర్కొన్నారు. ఫిబ్రవరిలో కూడా రూ.60 కోట్ల నష్టాన్ని ఆర్టీసీ మూటగట్టుకుంది. దీంతో 11 నెలల్లో రికార్డు స్థాయిలో రూ.708 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ నష్టాల్లో సీమాంధ్ర వాటా అధికంగా ఉన్నట్టు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో గత ఐదేళ్ల నష్టాలను పరిశీలించిన అధికారులు తెలంగాణ కంటే సీమాంధ్రలోనే నష్టాలు ఎక్కువ ఉన్నట్టు తేల్చి ఆ దామాషా లెక్కగట్టే పనిలో పడ్డారు. దీంతో ఏ ప్రాంతంలో వచ్చిన నష్టాలను ఆ ప్రాంతానికే పరిమితం చేసే దిశగా నివేదిక సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు ఉన్న రూ.4,800 కోట్ల నష్టాలను ఈ లెక్కన విడదీసీ ఆయా రాష్ట్రాల ఖాతాలో జమ చేయనున్నారు.
సీమాంధ్రలో నిర్మాణాల బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి: ఆర్టీసీలో ఉద్యోగులు, ఆస్తుల విభజన సులభంగానే జరుగుతోంది. అయితే నష్టాలు, అప్పుల్లో మునిగిన ఆర్టీసీ ఇప్పుడు భారీ ఖర్చులను భరించే స్థితిలో లేదు. దీంతో కొత్తగా ఏర్పడే సీమాంధ్ర రాజధానిలో కొత్త భవనాల నిర్మాణం తనవల్ల కాదని దాదాపు చేతులెత్తేసింది.