సంక్రాంతి సంబరాల పేరుతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు 13, 14 తేదీల్లో స్వగ్రామం నారావారిపల్లెలో బస చేసినా, చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌చార్జిపై ఒక నిర్ణయానికి రాలేకపోయారు.
సాక్షి, తిరుపతి :సంక్రాంతి సంబరాల పేరుతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు 13, 14 తేదీల్లో స్వగ్రామం నారావారిపల్లెలో బస చేసినా, చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌చార్జిపై ఒక నిర్ణయానికి రాలేకపోయారు. దీంతో తెలుగుతమ్ముళ్లు అసంతృప్తి వ్యక్తం చే స్తున్నారు. భార్య భువనేశ్వరి, కుమారుడు లో కేష్, కోడలు బ్రాహ్మణితో కలిసి పండుగకు చంద్రబాబు స్వగ్రామానికి వచ్చారు.
రెండు రోజుల పాటు ఇక్కడ ఉండడంతో సొంత నియోజకవర్గంలో నాయకత్వ లోటును భర్తీ చేస్తారని, పండుగరోజు తమకు ఉత్సాహం నింపే నిర్ణయాన్ని ప్రకటిస్తారని తమ్ముళ్లు ఆ శించారు. అలాంటిదేమీ జరగకపోగా, మంత్రి గల్లా అరుణకుమారి కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరితే ఎదురయ్యే అసంతృప్తులు, అలకలను తగ్గించి సర్దుబాటు చేసే బాధ్యత చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌పై ఉంచినట్లు సమాచారం. జిల్లాలో ఖాళీగా ఉన్న ఉన్న పలమనేరు, పీ లేరు, జీడీ నెల్లూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను ప్రకటించడంలోనూ నిర్ణయం తీసుకోలేకపోయారు.
వచ్చేవారే చూస్తారు
సొంత నియోజకవర్గమైన చంద్రగిరిలోని టీ డీపీ నేతలను చంద్రబాబునాయుడు 13వ తేదీ రాత్రి పది గంటల సమయంలో ఇంటికి పిలిపించుకుని మాట్లాడారు. నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్యే అభ్యర్థి విషయం తెలుగుతమ్ముళ్లు లేవనెత్తగా ‘వచ్చే అతను చూసుకుం టాడు, మీరేం డబ్బులు పెట్టద్దు, వాళ్లే పెట్టుకుంటారు. అందరూ కలసికట్టుగా పనిచేయండి.
నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా మంచివాళ్లనే వే స్తాను’ అంటూ చంద్రబాబు తమ్ముళ్లకు హితబోధ చేశారు. ఇన్‌చార్జిగా ఎవరు వస్తారనే పే రు మాత్రం బయట పెట్టలేదు. అదే సమయం లో ‘పార్టీలోకి అందరూ వస్తారు. వచ్చేవారిని కాదనకండి, పార్టీలో నుంచి బయటకు వెళ్లాలని ప్రయత్నించేవారిని ఆపే ప్రయత్నం చేయండి’ అంటూ తమ్ముళ్లకు సూచిం చినట్లు సమాచారం.
అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా నగరి శాసనసభ్యుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు, చంద్రబాబు తమ్ముడు నారా రామ్మూర్తినాయుడి కుమారుడు నారా గిరీష్ పేర్లు వినపడుతున్నాయి. నగరిలో సమీకరణాలు మారి మాజీ మంత్రి చెంగారెడ్డి వర్గం సైకిల్ ఎక్కితే, గాలి ముద్దుకృష్ణమనాయుడు ను చంద్రగిరి నుంచి బరిలోకి దింపాలని అధినేత ఆలోచిస్తున్నట్లు చంద్రగిరి నియోజకవర్గ తమ్ముళ్లు చెబుతున్నారు.
కమ్మ సామాజికవర్గం నుంచి గాలి ముద్దుకృష్ణమనాయుడు బలమైన అభ్యర్థి అవుతారని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఒకవేళ ఇది కుదరకపోతే నారా కుటుంబం నుంచి నారా గిరీష్ పేరు తమ్ముళ్ల నోళ్లలో నానుతోంది. గతంలో నారా రామ్మూర్తినాయుడు ఇక్కడే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందటం, నియోజకవర్గంలో వీరి కుటుంబానికి అభిమానులు ఉండటంతో యువత కోటాలో నారా గిరీష్‌ను అభ్యర్థిగా ప్రకటించాలని టీడీపీలోని ఒక వర్గం డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో గల్లా అరుణ ఆగమనం తరువాతే అధినేత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.