సాక్షి ప్రతినిధి, కడప: ‘ఏం మల్లయ్య ఎగిరి పడ్డావ్...అంటే అదొక లగువులే’ అన్నట్లుగా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తీరు ప్రస్పుటం అవుతోంది. జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమికి అధినేత చంద్రబాబు గరంగరంగా ఉన్నట్లు సమాచారం. ఎన్నికల బాధ్యతలు చేపట్టిన సీఎం రమేష్‌పై మండిపడ్డట్లు తెలుస్తోంది. అధినేత చీవాట్లు పెట్టారని జిల్లా నేతలకు తెలిస్తే తన పరపతికి ఎక్కడ భంగం కల్గుతుందోనని హైటెక్ పోకడలకు పోతున్నట్లు సమాచారం. తనపై ఉన్న వ్యతిరేకతను జిల్లా నాయకులందరికీ అంటగట్టే ప్రయత్నంలో భాగంగా ఇన్‌ఛార్జ్‌లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
తెలుగుదేశం పార్టీకి సీమాంధ్రలో ప్రజలు పట్టంగట్టారు. ఆపార్టీ నేతల ఊహలకు భిన్నంగా ఫలితాలు దక్కాయని విశ్లేషకుల అభిప్రాయం. అయితే వైఎస్సార్‌జిల్లాలో ఘోర వైఫల్యం చెందారు. చావుతప్పి కన్నులొట్టైనట్లుగా పదింటిలో ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అదికూడా తెలుగుదేశం పార్టీ గొప్పతనంతో కాకుండా డబ్బును నమ్ముకోవడం వల్లే మేడా మల్లికార్జునరెడ్డి గట్టెక్కినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. ఈపరిణామాలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఆమేరకు జిల్లాలో ఎన్నికల బాధ్యతలు నిర్వర్తించిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆవిషయం జిల్లా స్థాయిలో తెలుగుతమ్ముళ్ల వరకూ చేరడంతో ఎంపీ రమేష్ తనదైన ైశె లిలో వ్యవహరిస్తున్నట్లు సమాచారం....
ఇన్‌ఛార్జ్‌లతో ప్రత్యేక సమావేశం....
జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమికి అధినేత చంద్రబాబు మనందరిపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు.. ఇకనైనా మనమంతా ఐక్యంగా పార్టీని ముందుకు నడిపించాలంటూ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ జిల్లా నాయకులతో చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది. మహానాడుకు వెళ్లిన జిల్లా నాయకులతో ఆయన హైదరాబాద్‌లో ప్రత్యేక సమావేశం అయినట్లు తెలుస్తోంది. జిల్లాలో పది స్థానాల్లో పోటీచేసిన అభ్యర్థులతోపాటు, మాజీ ఎమ్మెల్యేలు వీరశివారెడ్డి, లింగారెడ్డి సైతం సమావేశంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది.
మీరు ఎవరికి చెబితే వారికే నామినేటెడ్ పోస్టు లు ఇప్పిస్తాం.. పార్టీ కోసం అంకితభావంతో కృషి చేయండి.. మనందరిపై అధినేత ఆగ్ర హంతో ఉన్నారంటూ చెప్పుకొచ్చినట్లు సమాచారం. జిల్లా పరిషత్‌ను కైవసం చేసుకునే అవకాశాన్ని పరిశీలించండి,. మీపరిధిలోని జడ్‌పీటీసీలను మనవైపు నకు లాక్కొండని సలహా ఇచ్చినట్లు స మాచారం. మనం ఓటమి చెందాం.., ఇప్పుడు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించినా తగినంత మంది వచ్చే పరిస్థితిలేదు,. అభాసుపాలవుతామంటూ ఒకరిద్దరు చెప్పుకొచ్చినట్లు సమాచారం.
జిల్లాలో ఆధిపత్యం కోసం రాజ్యసభసభ్యుడు సీఎం రమేష్ ప్రయత్నిస్తున్న వైఖరి సమావేశం లో స్పష్టంగా కన్పించినట్లు ఆపార్టీ సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబును నాయకులు కలవకుండా తాను చెప్పినట్లుగానే వ్యవహరించేలా ఉండాలనే లక్ష్యంతోనే సమావేశం నిర్వహించినట్లు వారు పేర్కొంటున్నారు. హైటెక్ ఎత్తుగడల్లో భాగంగానే సమావేశం నిర్వహించారనే అంచనాకు జిల్లా నేతలు వచ్చినట్లు సమాచారం. అధినేత చురకలంటిస్తే కప్పిపుచ్చుకుంటూనే అందరికీ చుట్టేయత్నం చేశారని ఆపార్టీ సీనియర్‌నేత ఒకరు ‘సాక్షి’కి వివరించడం గమనార్హం.
రూటే వేరు
Published Fri, May 30 2014 1:25 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM
Advertisement
Advertisement