అమ్మకు మాటిచ్చా.. : హీరో విశాల్
ఈ ఏడాది డెరైక్ట్ తెలుగు మూవీ చేస్తా: హీరో విశాల్
పూర్ణామార్కెట్ : ఇన్నాళ్లు తెలుగు ప్రేక్షకులను తమిళ డబ్బింగ్ సినిమాలతో అలరించాడు.. నేరుగా తెలుగు సినిమా చేస్తానని అమ్మకు మాటిచ్చాడంట.. అందుకే ‘అమ్మ తోడు.. ఈ ఏడాది తెలుగులో అలరిస్తా’నంటున్నాడు హీరో విశాల్. ఇటీవల విడుదలైన ఇంద్రుడు చిత్రం విజయయాత్రకు ఆదివారం నగరానికి వచ్చిన హీరో విశాల్ విలేకరులతో కాసేపు ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
మాది తెలుగు కుటుంబమే...
నేను చెన్నైలో పుట్టిపెరిగినా నాకు తెలుగు బాగా వచ్చు. ఎందుకంటే మా అమ్మ రాజమండ్రి ప్రాంతానికి చెందినవారు. ఇక్కడ కట్టు బొట్టు సంప్రదాయాలు నాకు చిన్నప్పటి నుండి పరిచయమే. మా అమ్మకు మాటిచ్చాను. అందుకే ఈ ఏడాది తెలుగులో డైరక్ట్ మూవీ చేసి తీరుతాను. ఇందుకోసం యాక్షన్ ఓరియెంటెడ్ కథ తయారు చేశాం. దీనికి శశికాంత్ దర్శకత్వం వహిస్తాడు. విజయవాడలో షూటింగ్ ప్లాన్ చేస్తున్నాం.
‘ఇంద్రుడు’ అలరిస్తాడు..
నా తాజా చిత్రం నిజంగా కొత్తదనంతో కూడిన కథతో మీ ముందుకు వచ్చింది. హీరో నాకొలెప్సీ అనే స్లీపింగ్ డిజార్డర్‌తో బాధపడుతుంటాడు. దుఖం, సంతోషం, కోపం ఎటువంటి ఎమోషన్ వచ్చినా హీరో నిద్రలోకి వెళ్తుంటాడు. ఆద్యంతం ఆసక్తిగా ఉంటుంది.
విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ద్వారా....
నా టేస్ట్‌కు తగ్గట్టు చిత్రాలు తీయాలన్న ఉద్దేశంతో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ స్థాపించాను. నా బ్యానర్‌లో పల్నాడు తొలి చిత్రం. ఇపుడు ఇంద్రుడు రెండోది. ఇకపై మరిన్ని చిత్రాలు నిర్మిస్తాను. నాకు మల్టీస్టారర్ చిత్రాలంటే ఇష్టం. తె లుగు తమిళంలో ఈ సినిమా చేయాలనుంది. అలాగే నా బ్యానర్‌లో నాతో పాటు మంచి కధలు ఉంటే ఇతర హీరోలను పెట్టి సినిమాలు తీస్తాను.
దర్శకత్వం చేయాలనుంది....
దర్శకత్వం చేయాలనేది నా ఆశ. తమిళంలో విజయ్‌ను హీరోగా పెట్టి మంచి చిత్రం తీస్తాను. తెలుగులో ప్రభాస్ ఇష్టం. తమిళంలో విజయ్ నచ్చుతాడు. ఇక హీరోయిన్లు అయితే గత నెల ఇలియానా, ఈ నెల కాజల్ అగర్వాల్ నచ్చింది (నవ్వుతూ)
అది నా అదృష్టం....
బాల దర్శకత్వంలో వాడు వీడు చిత్రం చేయడం నా అదృష్టం. అంత మంచి దర్శకుని వద్ద పనిచేస్తూ నటనలో ఎంతో నేర్చుకున్నాను. ఆ సినిమాలో మెల్లకన్నుతో ఓ పాత్ర చేశాను. షూటింగ్ ముందు ఓ డాక్టర్‌తో చెప్తే ఎన్ని కోట్లు ఇచ్చినా మెల్లకన్ను పెట్టి నటించడం మంచిది కాదన్నారు. కాని పాత్ర మీద ఆసక్తితో నటించాను.
తదుపరి చిత్రాలు....
హరి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాను. దానిపేరు తమిళంలో పూజై, తెలుగులో పూజ పేరుతో తీస్తున్నాం. శృతిహాసన్ హీరోయిన్. దీపావళికి విడుదల చేస్తాం.
విశాఖ షూటింగ్‌కు అనుకూలం....
నేను చాలాసార్లు విశాఖ వచ్చాను. ముఖ్యంగా స్టార్ క్రికెట్ మ్యాచ్‌లకు ఎక్కువ వచ్చాను. చాలా ప్రశాంత నగరం. షూటింగ్‌లకు చాలా అనుకూలం.