వెలగపూడిలో నిర్మిస్తున్న ఏపీ తాత్కాలిక సచివాలయానికి వెళ్లి పనిచేసే రోజు దగ్గరపడుతుండటంతో ఉద్యోగులు, కార్యాలయాల తరలింపు ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్య ప్రకాశ్ టక్కర్ ముమ్మరం చేశారు.
హైదరాబాద్ : వెలగపూడిలో నిర్మిస్తున్న ఏపీ తాత్కాలిక సచివాలయానికి వెళ్లి పనిచేసే రోజు దగ్గరపడుతుండటంతో ఉద్యోగులు, కార్యాలయాల తరలింపు ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్య ప్రకాశ్ టక్కర్ ముమ్మరం చేశారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో పరిపాలన పరంగా ఏ కేటగిరీ ఉద్యోగులను ఎంత మందిని ఉంచాలి, ఎవరికి మినహాయింపు ఇవ్వాలనే అంశాలపై సీఎస్ శనివారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. మరో పక్క వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో పనిచేసే రోజులు, సమయానికి సంబంధించి సాధారణ పరిపాలన శాఖ ఫైలును రూపొందించింది. ఏడాది పాటు వెలగపూడి సచివాలయంలో వారానికి ఐదు రోజులు పనిదినాలను అమలు చేయాలని ఫైలులో పేర్కొంది.
సోమవారం నుంచి శుక్రవారం వరకు ఐదు రోజుల పనిదినాలు ఏడాది పాటు అమలుకు ఆదేశాలను జారీ చేయాలని నిర్ణయించారు. అలాగే పనివేళల్లో కూడా మార్పులు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కార్యాలయాల పనివేళలు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకుగా ఉంది. అయితే వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం పనివేళలను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకుగా ఖరారు చేశారు. ఇందుకు సంబంధించిన ఫైలుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ ఆమోదం తెలుపుతూ ముఖ్యమంత్రి ఆమోదానికి పంపించారు. ఉన్నతాధికారుల సమీక్షలో వచ్చిన సూచనలు, సలహాలు ఆధారంగా శనివారం తరలింపునకు సంబంధించిన మార్గదర్శకాలను ఖరారు చేయాలని సీఎస్ నిర్ణయించారు.