తేటగుంటలో..కాసులపంట
Published Sun, Dec 22 2013 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 1:50 AM
తుని రూరల్ / తుని, న్యూస్‌లైన్ :పదహారో నంబరు జాతీయ రహదారిపై తుని మండలం తేటగుంట వద్దనున్న రవాణా శాఖ చెక్‌పోస్టు అవినీతిపరులకు ఏడాది పొడవునా ఫలాలనిచ్చే కల్పవృక్షం లాంటిది. రాష్ట్రం లో ఒకచోటి నుంచి ఒకచోటికి వెళ్లే వాహనాలతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే వాహనాలు నిత్యం వేలాదిగా ఈ రహదారిలో ప్రయాణిస్తుంటాయి. వాటిని తనిఖీ చేసి వాహనాలు కండిషన్లో లేకపోయినా, నిబంధనలకు అనుగుణంగా రికార్డులు లేకపోయినా, మితిమీరిన లోడు వేసినా జరిమానా విధించాల్సిన చెక్‌పోస్టు సిబ్బంది తమ చేతులు తడిపితే చాలు.. ఏ వాహనానికైనా ‘రైట్’ చెప్పేస్తారు. వాహనం కెపాసిటీకి మించి లోడు వేస్తే అదనపు టన్నుకు రూ.వేలల్లో అపరాధ రుసుము విధించాలి. వాహనాల రికార్డులు సక్రమంగా లేకపోయినా కేసులు నమోదు చేయాలి. ఇక ప్రైవేటు బస్సుల సంఖ్య వందల్లో ఉన్నా చూసీచూడనట్టు వదిలివేస్తున్నారు.
ఇటీవల జరిగిన ఓల్వో బస్సు ప్రమాదం తర్వాత తనిఖీ చేసి కేసులు నమోదు చేసి, హడావిడి చేసినా.. ఇప్పుడు ఆ బస్సులు నిబంధనల ప్రకారం లేకపోయినా యథాతథంగా నడుస్తున్నాయి. వాటి యజమానులు రవాణా శాఖ అధికారులకు నెలవారీ మామూళ్లు ఇవ్వడమే ఇందుకు కారణమని ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. ఇక చెక్‌పోస్టులో పగలు, రాత్రీ తేడా లేకుండా ప్రైవేటు వ్యక్తులనే వాహనదారుల నుంచి మామూళ్లు దండుకోవడానికి నియోగిస్తున్నారు. ఏసీబీ దాడులు చేసినా తప్పించుకోవడానికే ఈ ఎత్తుగడ. ఈ రకంగా వేలాది వాహనాల నుంచి దండుకునే సొమ్మును ఆ శాఖ ఉన్నతాధికారుల నుంచి దిగువస్థాయి సిబ్బంది వరకు పంచుకుంటుంటారు. ప్రభుత్వం విధించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి కేవలం మొక్కుబడిగా మాత్రమే కేసులు రాస్తుంటారు. ఈ చెక్‌పోస్టులో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఎంవీఐ)పోస్టుకు రూ.25 లక్షలు ముడుపుగా చెల్లించేందుకు సిద్ధమవుతున్నారంటేనే.. ఇక్కడి దొడ్డిదారి రాబడి ఏ మేరకు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడుల్లో ఈ బండారం బయటపడుతున్నా రవాణాశాఖ సిబ్బంది తీరు మారడం లేదు. శనివారం జరిగిన తాజా దాడే అందుకు నిదర్శనం.
ఏసీబీ అదుపులో ఇద్దరు ఎంవీఐలు,
నలుగురు ప్రైవేట్ వ్యక్తులు
ఏసీబీ డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నలుగురు ఇన్‌స్పెక్టర్లు శనివారం తెల్లవారుజామున ఈ చెక్‌పోస్టుపై దాడి చేశారు. ఉదయం తొమ్మిది గంటల వరకు చెక్‌పోస్టు సిబ్బందిని, అక్కడున్న ప్రైవేట్ వ్యక్తులను ప్రశ్నించారు. ఎంవీఐలు సిద్ధిక్, శేఖర్‌ల నుంచి రూ.73 వేలు, ప్రైవేట్ వ్యక్తులైన సుర్ల నారాయణస్వామి(వి.కొత్తూరు), తేటగుంటకు చెందిన ఆకుల బాబ్జి, గజ్జి వరహాలు, కె.పాదాలుల నుంచి రూ.12 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఆరుగురినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు డీఎస్పీ చెప్పారు. ఇక్కడ అక్రమ వసూళ్లు భారీగా జరుగుతున్నట్టు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో దాడి చేసినట్టు తెలిపారు. దాడుల్లో ఏలూరుకి చెందిన ఇన్‌స్పెక్టర్లు కొమరయ్య, విల్సన్, రాజమండ్రికి చెందిన రాజశేఖర్, సంజీవరావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఏసీబీ అధికారులు ఇదే చెక్‌పోస్టుపై 2011 నవంబరులో దాడి చేసి రూ.1.20 లక్షలు, 2012 అక్టోబరులో దాడి చేసి రూ.నాలుగు లక్షలు స్వాధీనం చేసుకోవడం గమనార్హం. కొందరు ఏసీబీ కేసుల్లో చిక్కుకుని జైలుకి వెళ్లినా ఇక్కడ అక్రమ వసూళ్లకు ‘చెక్’ పడడం లేదు. వీరికి కొందరు ప్రజాప్రతినిధుల అండ ఉండడంతో నిర్భయంగా అక్రమ దందా కొనసాగిస్తున్నారు. ఏటా సుమారు రూ.తొమ్మిది కోట్ల అపరాధ రుసుమును వసూలు చేసే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చెక్‌పోస్టులో 12 మంది ఎంవీఐలను నియమించింది. అయితే ఆ మొత్తం కన్నా.. సిబ్బంది దండుకునే మామూళ్లు అనేకరెట్లు ఉంటాయంటున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంతో సుమారు రెండు నెలలు చెక్‌పోస్టు మూతపడింది. తిరిగి తెరుచుకున్న అనంతరం ఆవురావురుమంటున్న చెక్‌పోస్టు సిబ్బంది ‘స్వామికార్యం’గా అటు సర్కారు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికీ, ‘స్వకార్యం’గా ఇటు ‘రెండునెలలు కోల్పోయిన స్వార్జితం’ భర్తీకి మామూళ్ల దందాను ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏసీబీ దాడి జరగడం గమనార్హం.
Advertisement
Advertisement