నేడు ఉపపోరు | The by-election today | Sakshi
Sakshi News home page

నేడు ఉపపోరు

Published Sat, Sep 13 2014 2:14 AM | Last Updated on Tue, Aug 14 2018 2:50 PM

The by-election today

  • ‘నందిగామ’ ఓటర్లు    -    1,84,064
  •  బరిలో ఉన్న అభ్యర్థులు    -    4
  •  పోలింగ్ కేంద్రాలు    -    200
  •  పోలింగ్ సమయం    -    ఉ. 7 నుంచి సా. 6 వరకు
  • నందిగామ రూరల్ : నందిగామ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక శనివారం ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని చర్యలు చేపట్టినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి.రజనీకాంతరావు తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఈవీఎంలతోపాటు ఇతర సామగ్రిని అందించేందుకు పట్టణంలోని కేవీఆర్ కళాశాలలో శుక్రవారం డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సిబ్బందికి సామగ్రి పంపిణీని రజనీకాంతరావు పరిశీలించారు.

    అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గంలో 1,84,064 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, వారిలో పురుషులు 90,731 మంది, మహిళలు 93,309 మంది, ఇతరులు 24 మంది ఉన్నారని తెలిపారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా 200 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశామని చెప్పారు.

    పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించేందుకు 1,400 మంది సిబ్బందిని వినియోగిస్తున్నామని వివరించారు. 129 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్  ఏర్పాటు చేశామని, ఇందుకోసం నూజివీడు ట్రిపుల్ ఐటీకి చెందిన 250 మంది విద్యార్థుల సేవలను వినియోగించుకుంటున్నామని తెలిపారు. పోలింగ్ సమయంలో ఎక్కడైనా ఈవీఎంలు మొరాయిస్తే వెంటనే మరొకటి ఏర్పాటు చేసేందుకు 80 సిద్ధంగా ఉంచామని పేర్కొన్నారు. ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చన్నారు.

    డిస్ట్రిబ్యూషన్ కౌంటర్ వద్ద ఉదయం నుంచి ఎన్నికల సిబ్బంది గ్రామాలకు తరలివెళ్లేంత వరకు ఏజేసీ బీఎల్ చెన్నకేశవరావు కూడా కేవీఆర్ కళాశాలలోనే ఉండి పర్యవేక్షించారు. ఉప ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందిని జిల్లాలోని పలు డిపోలకు చెందిన 40 బస్సుల్లో శుక్రవారం సాయంత్రం ఆయా గ్రామాలకు తరలించారు.  కేవీఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మెడికల్ క్యాంపులో ఎన్నికల రిటర్నింగ్ అధికారి రజనీకాంతరావుతోపాటు సిబ్బంది, పోలీసులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
     
    బరిలో నలుగురు


    ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా తంగిరాల సౌమ్య, కాంగ్రెస్ తరఫున బోడపాటి బాబురావు, స్వతంత్ర అభ్యర్థులుగా మాతంగి పుల్లారావు, కటారపు పుల్లయ్య పోటీలో ఉన్నారు. ఉప ఎన్నికలో గెలుపుకోసం టీడీపీ, కాంగ్రెస్ పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి.
     
    బందోబస్తుకు 1,500 మంది పోలీసులు : ఎస్పీ


    ఉప ఎన్నికకు 1,500 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్టు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్‌పీ జి.విజయ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం నందిగామ వచ్చిన ఆయన ఎన్నికల విధులు నిర్వహించనున్న పోలీస్ సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం మాట్లాడుతూ ఉప ఎన్నికలు ప్రశాంత వాతవరణంలో జరిగేలా అన్ని రాజకీయ పార్టీ నాయకులు సహకరించాలని కోరారు. నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి.రజనీకాంత్‌రావును అడిగి ఏర్పాట్ల గురించి తెలుసుకున్నారు.
     
    పోలీసుల తీరుపై కాంగ్రెస్ ఫిర్యాదు

    నందిగామ : పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు ఆరోపించారు. ఈ మేరకు ఆయన స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి నందిగామ డీఎస్పీ కార్యాలయంలో ఉన్న జిల్లా అడిషనల్ ఎస్పీ సాగర్, ఏజేసీ చెన్నకేశవరావుకు శుక్రవారం రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

    తమ పార్టీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పహారా ఏర్పాటు చేయడంతోపాటు నాయకులను కూడా ఇక్కడ ఉండనివ్వడంలేదని, టీడీపీ కార్యాలయం వద్ద మాత్రం ఎటువంటి పహారా లేదని నరహరిశెట్టి తెలిపారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదు చేసిన వారిలో కాంగ్రెస్ అభ్యర్థి బోడపాటి బాబూరావు, నాయకులు వేల్పుల పరమేశ్వరరావు, పాలేటి సతీష్, తలమాల డేవిడ్‌రాజు, గింజుపల్లి అనిల్, పసుపులేటి శ్రీనివాసరావు ఉన్నారు.
     
    టీడీపీ భారీగా మద్యం, నగదు పంపిణీ
     
    కంచికచర్ల : ఉప ఎన్నికలో గెలిచేందుకు కాంగ్రెస్, టీడీపీ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. మొదట్లో కాంగ్రెస్‌ను తక్కువగా అంచనా వేసిన టీడీపీ నాయకులు ఆ తర్వాత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మంత్రులను రంగంలోకి తీసుకొచ్చారు. నందిగామలో మకాంవేసి కాంగ్రెస్ పాలనపై దుమ్మెత్తి పోశారు. అయినప్పటికీ తక్కువ మెజారిటీ వస్తే అధినేత ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని భావించి డబ్బు, మద్యం పంపిణీకి శ్రీకారం చుట్టారు. పలు గ్రామాల్లో గురు, శుక్రవారాల్లో ఓటుకు రూ.200 నుంచి రూ.300 వరకు పంపిణీ చేశారు.

    సిట్టింగ్ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు అకాల మరణంతో సానుభూతి పవనాలు వీస్తాయని టీడీపీ తరఫున బరిలో ఉన్న ఆయన కుమార్తె సౌమ్య విజయం సాధిస్తారని పరిశీలకులు భావిస్తున్నారు. అయినప్పటికీ టీడీపీ భయపడుతోందని సమాచారం. ఎన్నికల ముందు టీడీపీ చేసిన వాగ్ధానాలను అధికారంలోకి వచ్చిన తర్వాత చేయలేదని కాంగ్రెస్ పార్టీ జోరుగా ప్రచారం చేసింది. రైతులు, డ్వాక్రా మహిళలను రుణమాఫీ పేరుతో మోసం చేశారని ప్రజల్లోకి తీసుకెళ్లడం కూడా టీడీపీ నాయకుల ఆందోళనకు కారణమని పరిశీలకులు చెబుతున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement