సాక్షి, సంగారెడ్డి: ఎట్టకేలకు శిశు విక్రయాలపై తొలి కేసు నమోదైంది. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, చట్ట విరుద్ధంగా దత్తత తీసుకున్న దంపతులతో పాటు మధ్యవర్తిత్వం నెరిపిన దళారులపై శివ్వంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. శివ్వంపేట మండలం ఉసిరికపల్లి గ్రామ పరిధిలోని తౌర్యతండాకు చెందిన పతలోత్ బన్య, సునీత దంపతులకు 2013 నవంబర్ 23న మూడో కాన్పులో ఆడ శిశువు జన్మించింది. తొలి రెండు కాన్పుల్లో ఇద్దరు కుమార్తెలు జన్మించగా మూడో కాన్పులోనైనా మగ శిశువు పుడుతుందని ఆశించారు. కానీ మళ్లీ ఆడపిల్లే పుట్టడంతో వారు ఆ శిశువును విక్రయించాలనుకున్నారు.
ఈ వ్యవహారంలో శిశువు రెండుసార్లు చేతులు మారింది. తాళ్లపల్లితండాకు చెందిన కంసి, లాలూ దంపతులు 2013 డిసెంబర్ 4న తౌర్యతండాకు వెళ్లి బన్య దంపతులకు రూ.2 వేలు చెల్లించి 10 రోజుల వయస్సు గల శిశువును తీసుకెళ్లారు.ఈ దంపతులు ఆ శిశువును సంగారెడ్డికి చెందిన విష్ణువర్ధన్ గౌడ్, ఉమాదేవి దంపతులకు అప్పగించారు. వారి నుంచి సంగారెడ్డికి చెందిన ఏటీ శేఖర్, నాగరత్నం దంపతులు శిశువును కొనుగోలు చేశారు. ఈ వ్యవహారంలో విష్ణువర్ధన్ గౌడ్ దంపతులు కీలక పాత్ర పోషించినట్లు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ విచారణలో తేలింది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ జిల్లా పీడీ ఫిర్యాదు మేరకు విష్ణువర్దన్ గౌడ్ దంపతులను ప్రధాన నిందితులుగా పేర్కొంటూ మొత్తం 8 మందిపై శివ్వంపేట పోలీసులు 2013 డిసెంబర్ 27న ఐపీసీ సెక్షన్ 317 కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు.
12 ఏళ్ల వయస్సున్న శిశువులను వదిలించుకోవడం/ అమ్మివేయడం లాంటి ఆరోపణలపై ఈ సెక్షన్ వర్తిస్తుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన వెనుక శిశు విక్రయాల రాకెట్ హస్తం ఉన్నట్లు అనుమానాలు రేకెత్తుతున్నా.. అలాంటిదేం లేదని పోలీసులు కొట్టిపారేస్తున్నారు. నిందితులను గతంలోనే అదుపులోకి తీసుకుని వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
శిశు విక్రయంపై తొలి కేసు
Published Thu, Jan 9 2014 11:48 PM | Last Updated on Sat, Sep 2 2017 2:26 AM
Advertisement