
అవినీతిని పారదోలే వరకు నిద్రపోను
చిత్తూరు జిల్లా పలమనేరు నీరు-చెట్టు సభలో సీఎం చంద్రబాబు
* నేను అభివృద్ధిని యజ్ఞంలా చేస్తుంటే.. విపక్షాలు అడ్డుకుంటున్నాయి
* పట్టిసీమపై అవినీతి అంటూ గగ్గోలు పెడుతున్నాయి
* తెలంగాణ ప్రభుత్వంతో కలసి తప్పుడు రాజకీయాలు చేస్తున్నాయి
* పాసుబుక్కులు మీ-భూమికి అనుసంధానం
* ఆధార్‌తోనే ఇక అన్ని సర్టిఫికెట్లు
సాక్షి, చిత్తూరు: అవినీతి పెరిగిపోతోందని, దానిని పారదోలేంత వరకు నిద్రపోనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రెవెన్యూ మొదలుకుని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఒక్క పైసా అవినీతి జరగకుండా చూస్తానన్నారు. ప్రజలకు అవినీతి రహితపాలన అందిస్తానని శపథం చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరులో శుక్రవారం నిర్వహించిన నీరు-చెట్టు, పొలం పిలుస్తోంది, బడిబాట కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బొమ్మిదొడ్డి గ్రామంవద్ద కనికల్లు చెరువులో పూడికతీత కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అక్కడ ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రసంగిస్తూ పైవిధంగా పేర్కొన్నారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకోసం ఎమ్మెల్యేల ఓట్లు కొనుగోలు వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన సీఎం చంద్రబాబు అవినీతిని పారదోలుతానంటూ శపథం చేయడం గమనార్హం. పట్టిసీమలో అవినీతి అంటూ ప్రతిపక్షాలు పనిగట్టుకుని గగ్గోలు పెడుతున్నాయని, రాయలసీమకు నీళ్లిచ్చేందుకే దానిని ప్రారంభించినట్లు ఆయనీ సందర్భంగా చెప్పారు. ఆగస్టు నాటికి పట్టిసీమ ప్రాజెక్టును పూర్తిచేసి 80 టీఎంసీల నీటిని రాయలసీమకు తరలిస్తామన్నారు.
రాయలసీమకు నీళ్లిస్తే తాము ఉనికి కోల్పోతామని ప్రతిపక్ష పార్టీ పట్టిసీమను వ్యతిరేకిస్తోందని సీఎం ఆరోపించారు. తాను అభివృద్ధిని యజ్ఞంలా చేస్తుంటే... ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని చెప్పారు. రాజధానికి ప్రజలు స్వచ్ఛందంగా భూమి ఇస్తుంటే ప్రతిపక్షపార్టీ నేతలు అడ్డుతగులుతున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో కలసి తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
ఉద్యమంలా నీరు-చెట్టు..
నీరు-చెట్టు కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టినట్టు సీఎం చెప్పారు. చెరువుల్లో పూడికతీసి భూగర్భ జలాలు పెంపొందించడమే లక్ష్యమన్నారు. రూ.100కే ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తామని చెప్పారు. రైతులు పాసుపుస్తకాలకోసం ఇబ్బందులు పడకుండా ఉండేందుకే మీ-భూమి వెబ్‌సైట్‌ను తెస్తున్నామని చెప్పారు. అధికారులు ఇక ఆధార్‌నే ప్రామాణికంగా తీసుకుంటారని చెప్పారు. అనంతరం పలమనేరు ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ముఖాముఖీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
విజయవాడకు చెందిన ఏ ఫైలైనా వారంలో పరిష్కారం
తన పేషీ అధికారులకు సూచించానన్న సీఎం..
సాక్షి, విజయవాడ బ్యూరో: విజయవాడకు సంబంధించిన ఏ ఫైలునైనా వారంరోజుల్లో క్లియర్ చేయాలని తన పేషీ అధికారులకు సూచించానని సీఎం చంద్రబాబు చెప్పారు. శుక్రవారమిక్కడ విజయవాడలో తన క్యాంపు కార్యాలయం ఆవరణలో బస్సులోనే కృష్ణాజిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు. విజయవాడ నగర సుందరీకరణ పనులను త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు.
ఇంద్రకీలాద్రి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. త్వరలో బెంజిసర్కిల్ దగ్గర ఫ్లైఓవర్ నిర్మాణానికి అడ్డంకులు తొలగుతాయని చెప్పారు. గుంటూరు, విజయవాడతోపాటు రాజధాని అమరావతికి చెత్తవల్ల ఇబ్బందుల్లేకుండా చేస్తామని తెలిపారు. పోలవరం కుడికాలువ నిర్మాణంవల్ల భూములు కోల్పోతున్న రైతులతో సమావేశమై వారికి వన్‌టైమ్ సెటిల్‌మెంట్‌గా రూ.700 కోట్లు ఇస్తామని హామీఇచ్చారు.
పామాయిల్ చెట్టుకు రూ.12 వేలు ఇచ్చేందుకు అంగీకరించారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో పొగాకు రైతులు, బోర్డు అధికారులతో జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ రైతుల సమస్యలు పట్టించుకోకపోతే పొగాకు బోర్డు ఎందుకంటూ.. ఒప్పందాల ప్రకారం కొనుగోళ్లు చేయకపోతే తీవ్రంగా పరిగణిస్తామన్నారు.