పేరుకుపోయిన ఆస్తిపన్ను బకాయిలపై వడ్డీ మాఫీ అయింది. ఈ నెల 31లోగా పాత బకాయిలు చెల్లిస్తే వాటిపై 24శాతం వడ్డీని మాఫీ చేస్తామని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సమీర్ శర్మ ఉత్వర్వులు జారీ చేశారు.
సాక్షి, మంచిర్యాల : ‘పుర’ ప్రజలకు శుభవార్త. పేరుకుపోయిన ఆస్తిపన్ను బకాయిలపై వడ్డీ మాఫీ అయింది. ఈ నెల 31లోగా పాత బకాయిలు చెల్లిస్తే వాటిపై 24శాతం వడ్డీని మాఫీ చేస్తామని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సమీర్ శర్మ ఉత్వర్వులు జారీ చేశారు. ఇకనుంచి ప్రజలందరూ పన్నులు సక్రమంగా చెల్లించుకునే వీలుగా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. దీంతో ఏళ్ల నుంచి ఆస్తిపన్ను కట్టలేక.. దానిపై విధించిన వడ్డీని చెల్లించలేక ఆందోళన చెందుతున్న ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం అన్ని మున్సిపాలిటీల్లో క లిపి పన్ను బకాయిలపై రూ.4 కోట్లపైనే వడ్డీ రావాల్సి ఉంది.
ఈ వడ్డీమాఫీతో జిల్లా ప్రజలపై ఆర్థిక భారం తగ్గుతుంది. జిల్లాలో ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, భైంసా, మందమర్రి, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. ప్రతి ఆర్థిక సంవత్సరం అన్ని మున్సిపాలిటీల్లో కలిపి రూ.13 కోట్లకు పైనే ఆస్తిపన్ను వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ మున్సిపాలిటీల్లో చాలా వార్డుల్లో పేదరిక సమస్య కారణంగా ఆశించిన మేరకు ఆస్తిపన్ను వసూలు కావడం లేదు. ఏటా సుమారు రూ.7 కోట్ల మేరకు పన్ను వసూలవుతోంది. పన్ను వసూలుకు మున్సిపల్ అధికారులు ఎంత ప్రచారం చేసినా.. ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించినా పన్ను చెల్లించేందుకు ప్రజలు ముందుకురాని పరిస్థితి. మరోపక్క ఆస్తిపన్ను వసూలు లక్ష్యం దాటాలని ప్రతి సంవత్సరం ప్రభుత్వం నుంచి మున్సిపల్ కమిషనర్లపై ఒత్తిడి పెరుగుతోంది.
ఇదే విషయంలో ఆర్థిక సంవత్సరం ముగింపులోగా కనీసం 80 శాతం పన్నులు వసూలు చేయాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని గతేడాది డిసెంబర్‌లోనే ప్రభుత్వం కమిషనర్లను ఆదేశించింది. దీంతో అధికారులు మొండిబకాయిల వసూళ్లపై దృష్టి సారించారు. ఇప్పటికీ నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలో రూ.1.82 కోట్లు, ఆదిలాబాద్‌లో రూ.2.5 కోట్లు, మంచిర్యాలలో రూ.2.21కోట్లు, బెల్లంపల్లిలో రూ.కోటి, భైంసాలో రూ.22లక్షలు, కాగజ్‌నగర్‌లో రూ.37లక్షల ఆస్తిపన్ను బకాయి ఉంది. వీటిలో మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో అత్యధికంగా రూ.1.20కోట్లు వడ్డీమాఫీ కానుందని అధికారులు వివరించారు. ఆదిలాబాద్‌లో రూ.కోటి, కాగజ్‌నగర్‌లో రూ.66లక్షలు, మిగిలిన మున్సిపాలిటీల్లో రూ.1.14కోట్ల వరకు వడ్డీమాఫీ అవుతుందని పేర్కొంటున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి..
వడ్డీ మాఫీ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఏళ్ల తరబడి ఆస్తి పన్నులు బకాయిలు ఉన్నవారికి వడ్డీ మాఫీ పూర్తి వెసులుబాటు ఇస్తుంది. ఆస్తిపన్నులు సకాలంలో చెల్లించుకునేలా వడ్డీ మాఫీ ప్రకటించినందుకు సంతోషం. వడ్డీ మాఫీ వల్ల వసూళ్లు పెరుగుతాయి. - ఆర్.సారంగపాణి, మంచిర్యాల