నచ్చని అధికారులపై బదిలీ వేటు!
- ఎస్పీ, ఆర్డీవోలను సాగనంపేందుకు యత్నాలు
- ఒక కేసులో ఎస్పీపై మాజీ ప్రతినిధి గుర్రు
- ఆర్డీవో తమను పట్టించుకోవడంలేదని పలువురి కినుక
- అధికారం చేపట్టకముందే ప్రయత్నాల్లో నేతలు
జిల్లాలోని ఇద్దరు కీలక అధికారులను బదిలీ చేసేందుకు పలువురు నేతలు పంతాలకు పోతున్నారు. తమకు అనుకూలంగా వ్యవహరించలేదనే అక్కసుతో.. తమ పార్టీ ఇంకా అధికారం చేపట్టకముందే వారిని సాగనంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు తగిన కారణాలు వెదికే పనిలో పడ్డారు. నేతల ప్రయత్నాలు గుప్పుమనడంతో జిల్లాలో సర్వత్రా చర్చ సాగుతోంది.
సాక్షి, మచిలీపట్నం : జిల్లా ఎస్పీ జె.ప్రభాకరరావు, బందరు ఆర్డీవో పి.సాయిబాబాలను బదిలీ చేయించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. కొన్ని వ్యవహారాల్లో తమకు అనుకూలంగా లేరన్న అక్కసుతో వారి బదిలీకి కొందరు పట్టుబడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. 2012 డిసెంబర్ ఒకటిన జిల్లాకు ఎస్పీగా వచ్చిన ప్రభాకరరావు సాధ్యమైనంత వరకు వివాదాలకు దూరంగానే విధులు నిర్వర్తిస్తూ వచ్చారు.
ఆయన జిల్లాకు వచ్చిన తరువాత సమైక్యాంధ్ర ఉద్యమం పెద్ద ఎత్తున సాగినా ఎక్కడా శాంతిభద్రతల సమస్య రాకుండా సమర్థవంతంగా పనిచేశారు. దీనికితోడు అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక, పంచాయతీ, సహకార సంఘాలు, మున్సిపల్, స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికలు వరుసగా వచ్చినా ఏ మాత్రం సమస్యలు తలెత్తకుండా జిల్లా పోలీస్ బాస్ కృషి చేశారు. దిగువ స్థాయి సిబ్బంది ఆరోగ్యం, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూనే వారితో సమర్థవంతంగా విధులు నిర్వర్తింపజేయడంలో తనదైన పాత్ర పోషించారు.
తమకు అనుకూలంగా వ్యవహరించలేదని..
అటువంటి ఎస్పీ ఒక కేసులో తమకు అనుకూలంగా వ్యవహరించలేదన్న కారణంతో ఒక మాజీ ప్రజాప్రతినిధి ఆయనపై ఉక్రోషంతో ఉన్నట్టు సమాచారం. ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్న మాజీ నేత కుమారుడిని స్థానిక పోలీసులు అరెస్టు చేయడం వెనుక ఎస్పీ ఒత్తిడే కారణమని ఆ పార్టీ నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు.
ఈ నేపథ్యంలోనే తమ పార్టీ అధికారంలోకి వస్తున్నందున జిల్లా ఎస్పీ ప్రభాకరరావును బదిలీ చేయించి తమ అడుగులకు మడుగులొత్తే పోలీస్ అధికారిని ఇక్కడకు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు చెందిన మాజీ ప్రజాప్రతినిధి ఒకరు హైదరాబాద్‌కు వెళ్లి ఎస్పీకి వ్యతిరేకంగా అక్కడ పావులు కదిపినట్టు సమాచారం. దీంతో ఎస్పీ బదిలీ తప్పదంటూ రెండు రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారంలో పెట్టారు.
వివాదాల సుడిలో ఆర్డీవో...
బందరు ఆర్డీవో పి.సాయిబాబును వివాదాలు చుట్టముడుతున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలో తహశీల్దార్‌గా పనిచేసిన సమయంలో ఆయనకు మంచి పేరుంది. అటు తరువాత పదోన్నతిపై మచిలీపట్నం వచ్చిన ఆయనపై సహోద్యోగులే కారాలు మిరియాలు నూరే పరిస్థితి వచ్చింది.
తన పరిధిలోని ప్రతి మండల రెవెన్యూ కార్యాలయంలో ఒక్కో ఉద్యోగిని సొంత మనిషిగా పెట్టుకుని ఆయన తహశీల్దార్‌లకు సమాంతరంగా మండలాల్లో వ్యవహారాలు చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఆఫీసు వేళల్లోను ఎవరైనా ఏదైనా చెప్పుకొందామని వస్తే అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం, బాధితులు తమ గోడు చెప్పుకొందామన్నా అందుబాటులో లేకపోవడం ఆర్డీవోపై ప్రజల్లో వ్యతిరేక భావనకు కారణమైంది. ఆయన వ్యవహారాలు ఎలా ఉన్నా ప్రజాప్రతినిధులను పట్టించుకోకపోవడం, వారికి నచ్చినట్టు వ్యవహరించకపోవడంతో పలువురు నేతలు ఆయనపై గుర్రుగా ఉన్నారు. ఆయన్ను కూడా సాగనంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.