
నాన్ బెయిలబుల్ కేసులతో బెదిరిస్తే ప్రయోజనం లేదు..
కాపులను బీసీల్లో చేర్చాలని ఆందోళన చేపట్టిన కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంతో సీఎం చంద్రబాబునాయుడు........
► మాజీ మంత్రి కాసు
► ముద్రగడతో సీఎం చంద్రబాబు
► చర్చలు జరపాలని డిమాండ్
నరసరావుపేట : కాపులను బీసీల్లో చేర్చాలని ఆందోళన చేపట్టిన కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంతో సీఎం చంద్రబాబునాయుడు చర్చలు జరపాలని మాజీ మంత్రి, పీసీసీ క్రమశిక్షణ సంఘ చైర్మన్ కాసు వెంకటకృష్ణారెడ్డి కోరారు. తన గృహంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ విధంగా వ్యవహరించకుండా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి బెదిరిస్తే సమస్య పెరిగి పెద్దదవుతుందని ెహ చ్చరించారు. ఆ సామాజిక వర్గానికి చెందిన మంత్రులతో స్టేట్‌మెంట్లు ఇప్పించినంతమాత్రాన ప్రజలు, కాపు సంఘీయులెవరూ విశ్వసించరని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన హామీ మేరకు బీసీ వర్గీయులకు ఇబ్బంది కలుగకుండా కాపులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని సూచించారు. చంద్రబాబు మేనిఫెస్టోలో పెట్టిన విషయంపైనే ముద్రగడ ఆందోళన చేస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో తాము మేనిఫెస్టోలో లేని ఆరోగ్యశ్రీ లాంటి పథకాలను సమర్థంగా అమలుచేసిన విషయాన్ని గుర్తుచేశారు.
సీఎం నుంచి స్పందనే లేదు..
రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరానికి నిధుల కేటాయింపుల ప్రతిపక్షాలను కూడా ఢిల్లీ తీసుకెళ్లాలని ఎన్నిసార్లు కోరినా సీఎం వద్ద నుంచి స్పందనే రావడంలేదని విమర్శించారు. పీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ కొండపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడారు. సమావేశంలో మాజీ ఎంపీపీ తన్నీరు శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి గర్నెపూడి అలెగ్జాండర్ సుధాకర్, గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ వైవీ నర్సిరెడ్డి, యువజన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అట్లూరి విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.