బౌలింగ్ బలంతోనే సంచలనం
► టీమ్ ఇండియాకు అదే అత్యవసరం
► ‘క్వార్టర్స్’ తర్వాత అదే విజయ సోపానం
► ‘సాక్షి’తో మాజీ అంతర్జాతీయ అంపైర్ పార్థసారథి
విశాఖ సిటీ డెస్క్: కనీస వసతులు లేని కాలంలో.. క్రికెట్ అంటే కేవలం పెద్ద నగరాలకు పరిమితమయ్యే తరుణంలో.. అంతర్జాతీయ మ్యాచ్‌లు అంటేనే అబ్బురపడే సమయంలో.. ఇరవై ఏడేళ్ల కిందట ఓ వన్డే మ్యాచ్‌ను విశాఖకు తీసుకు రావాలంటే.. అందుకు ఎంత శ్రమించాలి! ఎంత దీక్షతో పని చేయాలి! క్రికెట్ అంటే ప్రాణం పెట్టే కొందరు వ్యక్తులు అంత తాపత్రయపడ్డారు కాబట్టే అంతర్జాతీయ మ్యాచ్‌ల వేదికగా విశాఖ స్థానం స్థిరపడింది. అలా శ్రమపడ్డ వాళ్లలో కీలకంగా నిలుస్తారు జిల్లా క్రికెట్ సంఘం (వీడీసీఏ) కార్యదర్శి కె.పార్థసారథి. అంతే కాదు.. ఓ నిర్వాహకుడిగా మాత్రమే కాక, ఓ అంతర్జాతీయ అంపైర్‌గా ఆయన విశాఖకు చెప్పుకోదగ్గ గుర్తింపు తెచ్చారు. ప్రపంచకప్ క్రికెట్ మ్యాచ్‌లకు అంపైరింగ్ బాధ్యతలు నిర్వహించిన ఆయన ఇప్పటికీ విశాఖ క్రికెట్‌కు దిశానిర్దేశం చేయడంలో ప్రధాన పాత్ర నిర్వహిస్తున్నారు. ఆటంటే అవధుల్లేని ఇష్టం ఉన్న ఆయన ఇప్పటి ప్రపంచకప్ టోర్నీకి సంబంధించిన వివిధ అంశాలపై ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా స్పందించారు.
సాక్షి: పదకొండో ప్రపంచకప్ ప్రత్యేకతలేమిటి?
పార్థసారథి: చాలా రోజులకు మళ్లీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రపంచకప్ క్రికెట్ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. నలభై అయిదు రోజులపాటు క్రికెట్ అభిమానులకు ఇక పండగే పండగ. అక్కడి బౌన్సీ పిచ్‌లు దృష్టిలో పెట్టుకుంటే పోటీ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా బౌలింగ్ బలం ఉన్న జట్లకు ఇది అపూర్వ అవకాశం. ఇక భారత్ విషయానికి వస్తే దాదాపు పూర్తిగా కొత్త కుర్రాళ్లతో బరిలోకి దిగుతున్న జట్టు ఇది. యువరాజ్ సింగ్, గంభీర్ వంటి సత్తా ఉన్న ఆటగాళ్లను పక్కన పెట్టి రాయుడు, బిన్నీ వంటి ఫ్రెషర్స్ మీద ఆశలు పెట్టుకుని ధోనీ సేన ప్రపంచకప్ టోర్నీలో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
సాక్షి: ఎవరెవరి అవకాశాలు ఎలా ఉంటాయి?
పార్థసారథి: ఇక స్వదేశం కాబట్టి సహజంగానే ఆస్ట్రేలియాకు అవకాశాలు బాగుంటాయి. కానీ వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటే భారత్ కచ్చితంగా ముందంజ వేస్తుందనిపిస్తోంది. నా లెక్క ప్రకారం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, భారత్ సెమీస్‌కు చేరవచ్చు. ఈ జట్లలో ఆ రోజు ఎవరికి కలిసివస్తే ఆ జట్టు క్లిక్ అయిందన్నమాటే. బౌలింగ్‌లో రాణిస్తేనే భారత్ ముందంజ వేస్తుందన్నది స్పష్టం.
సాక్షి: ఈసారి వాతావరణం ఎలా ఉందంటారు?
పార్థసారథి: నిజం చెప్పాలంటే 2011 నాటి హైప్ ఈసారి లేదని చెప్పాలి. అప్పుడు భారత్‌లో జరగడం వల్ల ఆ ఉత్సాహం ఉందని కాదు.. ప్రపంచమంతా ఆ టోర్నీని ఎంతో ఆసక్తిగా గమనించింది. ఈసారి అంత ఉత్సాహం కనిపించడం లేదు.
సాక్షి: టీ20 ప్రభావం కారణమంటారా?
పార్థసారథి: కొంతవరకు కావచ్చు. ఇప్పటి మార్పులతో క్రికెట్‌లో మునుపటి థ్రిల్ తగ్గుతోందన్నది నా అభిప్రాయం.
సాక్షి: గత ప్రపంచకప్ టోర్నీలతో పోలిస్తే ఈసారి ఆట తీరెలా ఉందంటారు?
పార్థసారథి: ఇప్పటి క్రికెట్‌లో స్థాయి తగ్గిందన్నదే నా వ్యాఖ్య. ఒకప్పుడు ఆటలో వైవిధ్యం ఉండేది. ఇంత రక్షణ ఉపకరణాలు (ప్రొటెక్టివ్ గేర్) లేకుండా భయపెట్టే ఫాస్ట్‌బౌలింగ్‌ను అప్పటి ఆటగాళ్లు ఎదుర్కొనే వారంటే వాళ్ల సత్తా అర్ధమవుతుంది. ఇప్పుడా పరిస్థితి లేదు కదా. టెక్నిక్ విషయంలోనూ అప్పటి ఆటగాళ్లే అగ్రగాములని నా అభిప్రాయం. ఇప్పుడు ప్రారంభం నుంచి భారీ షాట్లే ప్రధానంగా ఆట సాగుతోంది. బౌలింగ్‌లో అంత డెప్త్ కనిపించడం లేదు. స్పిన్ పరిస్థితి చూస్తేనే అది అర్ధమవుతుంది.
సాక్షి: ఆట మీద దీని ప్రభావం ఉంటుందా?
పార్థసారథి: టెస్ట్‌లలో సైతం ఆ పరిస్థితి కనిపిస్తోంది కదా. అయిదు రోజుల టెస్ట్‌లు నాలుగు రోజుల్లో ముగిసిపోతున్నాయంటే క్వాలిటీ ఎలా ఉందో చెప్పవచ్చు. ఫీల్డింగ్ మెరుగుపడ్డ విషయం వాస్తవమే కానీ, ఇప్పటి వాళ్ల కన్నా సోల్కర్, వెంకట్రాఘవన్ వంటి వాళ్లు ఎక్కువ సాహసంతో ఫీల్డింగ్ చేసే వాళ్లనుకుంటాను.
సాక్షి: మీరు స్వదేశంలో, విదేశాల్లో అంపైరింగ్ చేశారు. 1996లో వరల్డ్‌కప్ టోర్నీలో అంపైరింగ్ బాధ్యతలు నిర్వహించారు. అప్పటికి ఇప్పటికి అంపైరింగ్ స్థాయి ఎలా ఉందంటారు?
పార్థసారథి: అంపైరింగ్ స్థాయి బాగా మెరుగుపడింది. ఇది సాంకేతిక అభివృద్ధి వల్ల కలిగిన మార్పు కాదు. అంపైర్లు తమ స్థాయిని మెరుగు పర్చుకునేలా బీసీసీఐ చేపట్టిన చర్యల కారణంగా ఈ మార్పు కనిపిస్తోంది. సాంకేతికంగా మార్పులు మంచివే కావీ ఎప్పుడైనా అంపైర్ తనంత తానుగా తీసుకునే నిర్ణయాలను గౌరవించడమన్నదే మంచిదని నా అభిప్రాయం. మైదానం మీద ఉన్న అంపైర్ నిర్ణయానికి ప్రాధాన్యం ఇవ్వడమే మంచిదన్నది నా ఉద్దేశం. కెమెరా ఆధారంగా తీసుకున్న నిర్ణయాలు కూడా పూర్తిగా కచ్చితమని చెప్పడం కష్టం కదా..
సాక్షి: వివాదాస్పదమైన డీఆర్‌ఎస్ (డెసిషన్ రిఫరల్ సిస్టమ్) గురించి?
పార్థసారథి: అంపైర్ నిర్ణయానికి అంతా కట్టుబడి ఉంటే మంచిది. ఇంకా దాని మీద అపీల్ ఏ మేరకు సబబో? బీసీసీఐ ఈ విషయంలో మొగ్గు చూపడం లేదు కానీ ఐసీసీ నిర్ణయం కాబట్టి తలవొగ్గక తప్పేట్టు లేదు. ఆటలో మార్పులు అనివార్యం కదా.. తప్పదు మరి.