పాఠశాలలో కంప్యూటర్ల చోరీ
- మోటూరులో ఘటన
- 11 కంప్యూటర్లు మాయం
- విలువ రూ.1.50 లక్షలు
గుడివాడ రూరల్ : మండలంలోని మోటూరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం రాత్రి కంప్యూటర్ల దొంగతనం జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం సిబ్బంది పాఠశాలలో అన్ని గదులకు తాళాలు వేశారు. రెండో శనివారం సెలవు కావడంతో ఉదయం అక్కడ ఆడుకునేందుకు పిల్లలు వచ్చారు. కంప్యూటర్ ల్యాబ్ తెరిచి ఉండటాన్ని చూసి లోనికి వెళ్లారు. అక్కడ కంప్యూటర్లు కనిపించలేదు. దీంతో ప్రధానోపాధ్యాయురాలు సుగుణకు ఫోన్ చేశారు.
ఆమెతోపాటు సిబ్బంది హుటాహుటిన వచ్చి కం ప్యూటర్ ల్యాబ్‌ను పరిశీలించారు. అందులోని 11 మాని టర్లు, రెండు సీపీయూలు, రెండు కీప్యాడ్‌లు చోరీకి గురైనట్లు గుర్తించారు. వీటి విలువ రూ.1.50 లక్షలు ఉంటుం దని అంచనా. గదిలోని బీరువా, సొరుగులు తెరిచి ఉండటాన్ని కూడా గుర్తించారు. వాటిలో ఏమీ లేకపోవడంతో కంప్యూటర్లను అపహరించుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. పాఠశాల సిబ్బంది అందించిన సమాచారం మేర కు రూరల్ ఏఎస్సై దుర్గాప్రసాద్ సిబ్బందితో వచ్చి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడతామన్నారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని చెప్పారు.
‘పాఠశాలకు రక్షణ కరువు’ శీర్షికతో గత మే నెలలో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. శుక్రవారం రాత్రి జరిగిన ఘటనతో ఈ విషయం రుజువైంది. ప్రభుత్వ పాఠశాలలో అటెండరు, నైట్ వాచ్‌మెన్ పోస్టులు భర్తీ చేయకపోవటంతో విలువైన సామాగ్రికి రక్షణ లేదని హెచ్చరించినప్పటికీ పట్టించుకోకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.