మంత్రులపై తుపాను బాధితుల ఆగ్రహం | Titli cyclone victims fires on AP Ministers | Sakshi
Sakshi News home page

తీరిగ్గా ఇప్పుడొస్తారా?

Published Tue, Oct 16 2018 3:07 AM | Last Updated on Tue, Oct 16 2018 11:56 AM

Titli cyclone victims fires on AP Ministers - Sakshi

మంత్రి కొల్లు రవీంద్రను నిలదీస్తున్న మహిళలు

వజ్రపుకొత్తూరు: తుపాను సాయంలో తీవ్ర జాప్యం చేస్తున్న సర్కారుపై ఉద్దానం ప్రజలు కన్నెర్ర చేశారు. సర్వం కోల్పోయి రోడ్డున పడితే తీరిగ్గా ఇప్పుడు వస్తారా అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. రాష్ట్ర కార్మిక, క్రీడా శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ అల్లుడు వెంకన్న చౌదరిని సోమవారం రోడ్డుపైనే అడ్డుకుని రెండు గంటల పాటు మండుటెండలో నిలబెట్టారు. అనంతరం పూండి కూడలి నుంచి రెండు కిలోమీటర్లు దూరంలో పెద్దమురహరిపురం గ్రామం వరకు నడిపించి తీసుకెళ్లారు. పూండి పరిసర ప్రాంతాలైన పీఎంపురం, సీఎంపురం, సీతంపేట, గూనాలపాడు, యూజీపురం, అమలపాడు తదితర గ్రామాల నుంచి వచ్చిన యువకులు, మహిళలు మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకుని నిలదీశారు. సీఎం డౌన్‌ డౌన్, మంత్రి కొల్లు రవీంద్ర, వెంకన్నచౌదరి గోబ్యాక్‌ అంటూ నినాదాలతో నిరసన వ్యక్తంచేశారు. అంతకుముందు బాధిత గ్రామాల ప్రజలు పూండిలోని వైఎస్సార్‌ కూడలి వద్ద రహదారిని దిగ్బంధించారు. ఈలోగా మంత్రి అక్కడకు చేరుకోవడంతో బాధితులంతా ఆయన కాన్వాయ్‌ని చుట్టుముట్టారు. తిత్లీ తుపాను వచ్చి ఐదు రోజులు కావస్తోంది.. బతుకులు ఛిద్రమై ఏడుస్తుంటే ఇప్పుడా మా గ్రామానికి వచ్చేది అంటూ నిలదీశారు. బాధితుల ఆగ్రహం చూసి మంత్రి నోట మాట రాలేదు.

 బాధితులకు హెచ్చరిక 
ఇదిలా ఉంటే.. బాధితులు ఓ వైపు తమ ఆవేదన వినిపిస్తుంటే వెంకన్న చౌదరి వారిని ఉద్దేశించి ‘అడ్డు తొలగుతారా.. పోలీసులను రప్పించి తొలగించమంటారా’.. అంటూ దురుసుగా ప్రవర్తించడంతో బాధితులు మరింత రెచ్చిపోయారు. తొలగించండి చూద్దాం.. అంటూ ఎదురుతిరిగారు. నష్టపరిహారం, పునరావాసంపై స్పష్టమైన హామీ ఇస్తేగానీ వదిలేది లేదంటూ భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో మంత్రి వారితో పాటు రెండు గంటలు నడిచారు. దారిలో ఓ మహిళ చంటి బిడ్డతో ఏడుస్తూ ఆందోళన వ్యక్తంచేసింది. పాలు పట్టేందుకు పాల ప్యాకెట్లు కూడా లేవని ఆయన దృష్టికి తీసుకెళ్లింది. ఈలోగా ప్రత్యేక పోలీసు దళంతో జిల్లా ఎస్పీ త్రివిక్రమవర్మ తన సిబ్బందితో అక్కడకు చేరుకుని ఆయనకు రక్షణగా నిలిచారు. పెద్దమురహరిపురం గ్రామానికి చేరకున్న మంత్రికి గ్రామాభివృద్ధి సంఘం అధ్యక్షుడు కళిశెట్టి గోపాల్‌ సమస్యలు వివరించారు.

 అడుగడుగునా నిరసనలు 
మరోవైపు.. తుపాను ప్రాంతాల్లో పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులకు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అడుగడుగునా నిరసనలు ఎదురవుతున్నాయి. పీఎంపురం, రెయ్యిపాడు గ్రామాల్లో రైతులు మంత్రులు, అధికారుల తీరుపై వ్యతిరేకత వ్యక్తంచేశారు. అమలపాడు, యూఆర్‌కేపురం, కంబారాయుడుపేట గ్రామాల్లో మంత్రికి నిరసనల సెగ తగిలింది. రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి జవహర్‌ పాత టెక్కలి మీదుగా వివిధ గ్రామాల్లో పర్యటించారు. ఆయనకూ నిరసనలు చుట్టుముట్టాయి.

కష్టాల్లోనూ దాతృత్వం
కాసులు కురిపించే తోటలు నేలమట్టమై పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ తమకంటే ఎక్కువ కష్టాల్లో ఉన్న పొరుగు వారిని అక్కున చేర్చుకుని తమ ఇళ్లలో ఆశ్రయం కల్పించడం ద్వారా చాలామంది రైతులు తమలోని ఔన్నత్యాన్ని చాటుకుంటున్నారు. ‘ఒకరికొకరు.. అందరికి అందరం..’ అనే మాటను వారు నిజం చేస్తున్నారు. వజ్రపుకొత్తూరు మండలం చినబైపల్లిలో ఇటీవలి తుపాను బీభత్సానికి పలు ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపోగా మరికొన్ని ఇళ్ల గోడలు కూలిపోయాయి. ఈ పరిస్థితుల్లో మూడు కుటుంబాల వారు మంచాల కింద తలదాచుకుని ప్రాణాలు రక్షించుకున్నారు. గూడు కోల్పోయిన ఇలాంటి ఎనిమిది కుటుంబాల వారికి అదే గ్రామానికి చెందిన పి. మధుసూదనరావు తన ఇల్లూ దెబ్బతిన్నప్పటికీ వారికి ఆశ్రయం కల్పించారు. ‘ఇలాంటి కష్టాల్లో ఒకరికొకరు తోడూనీడలా ఉండకపోతే బతికి ఏమి ప్రయోజనం’.. అని మధుసూధనరావు భార్య ‘సాక్షి’తో అన్నారు. వీరిలాగే చాలామంది రైతులు తమ గ్రామాల్లో అనేకమందికి ఆశ్రయం కల్పించి దాతృత్వం చాటుకుంటున్నారు. మరోవైపు.. ‘మా బిడ్డ కరిష్మ విశాఖలో బి.ఫార్మసి చదువుతోంది. దసరాలోగా ఫీజులు కట్టాలని కాలేజీ వారు నోటీసులు పంపారు. తుపాను బాధితుల పిల్లలకు ప్రభుత్వమే ఫీజులు చెల్లించాలి’.. అని మధుసూదనరావు భార్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

ఇదేనా ఆదుకునే తీరు?
నేను చంటి పిల్లతో ఉన్నాను. తాగేందుకు నీరులేదు. బిడ్డకు పాల ప్యాకెట్‌ కూడా అందలేదు. సహాయక చర్యలేవీ చేపట్టలేదు. ఏం తిని బతకాలి? కిలో టమాటా రూ.80కు.. అగ్గిపెట్టె రూ.6కు అమ్ముతున్నారు. సర్వం కోల్పోయిన వారిని ఇదేనా ఆదుకునే తీరు. ఇప్పటికే ఐదు రోజుల గడిచిపోయాయి. ఇంకా అంధకారంలోనే ఉన్నాం. మా గ్రామం వైపు చూసేవారే లేరు. 
– కె. రోహిణి, పీఎంపురం

బియ్యం, సరుకులు ఇవ్వలేదు
ఇల్లూ వాకిలి కోల్పోయి రోడ్డున పడ్డాం. రహదారులపై పడిన చెట్లను మేమే తొలగించాం. అధికారులు, ప్రజాప్రతినిధుల జాడే కరువైంది. కోట్లాది రూపాయల జీడి, కొబ్బరి చెట్లను కోల్పోయాం. చేతిలో చిల్లి గవ్వలేదు. నిత్యావసర ధరలు మండిపోతున్నాయి. అయినా మా గ్రామంలో బియ్యం, ఇతర సరుకులు పంపిణీ చేయలేదు.
– ఎస్‌. వినోద్, పెద్దమురహరిపురం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement