అయామ్ వెరీసారీ...అన్నాగా వందోసారి..
తప్పులు చేయడం మానవ సహజం. అలాగే తప్పు ఒప్పుకోవడం నైతిక బాధ్యత.దానిని పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఏ వ్యక్తికీ శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు. అయితే, తప్పు చేసినప్పుడు నిజాయితీగా ఒప్పుకునేవారుసంస్కారవంతులుగా, ఉత్తములుగా పేరుపొందుతారు. ఎంతటి శత్రువునైనా తప్పు ఒప్పుకుంటే క్షమించాలి. అతనిలో పరివర్తనకు మార్గం చూపాలి. నేడు క్షమా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం...
పాలకొండ రూరల్:తప్పు చేసినప్పుడు ఒక్కసారి క్షమించమని చెప్పడంలో తప్పు లేదు. పైగా మనిషిలోని సంస్కారానికి ప్రతీక క్షమా గుణం. బద్ధ శత్రువునైనా ఒక్క ‘సారీ’తో మంచి మిత్రునిగా మార్చుకోవచ్చు. క్షమించే గుణం, క్షమించమని కోరే గుణం మనిషిలోని పరివర్తనకు ప్రతి రూపం. మనుషుల మధ్య వైరుధ్యాలు లేకుండా మానవీయతను క్షమాగుణం ఆవిష్కరిస్తుంది. అపకారికి సైతం ఉపకారం చేయడం మహోన్నత వ్యక్తిత్వం. అపకారిని క్షమించడం కూడా మంచి మనస్తత్వానికి మచ్చుతునక. ఒక చెంపపైన కొడితే మరో చెంపను చూపించాలనే పూజ్య బాపూజీ సిద్ధాంతం క్షమాగుణానికి అత్యున్నత ప్రమాణం.
కొద్ది క్షణాల పాటు అంకెలు లెక్కపెట్టుకొని ఆలోచించడం, క్షమాగుణాన్ని అలవర్చుకోవడం వంటి లక్షణాలు ప్రతి ఒక్కరిలో ఉంటే చుట్టూ ఉన్న సమాజం ఆరోగ్యవంతంగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. క్షమాగుణాన్ని అలవర్చుకుంటే ప్రతి రోజుకు ఒక గొప్ప ప్రారంభం ఉంటుంది. తత్వవేత్తలు, ఆధ్యాత్మిక గురువులు, మేధావులు, విద్యావేత్తలందరూ తమ ప్రసంగాల్లో శాంతిని, క్షమాగుణాన్ని కాంక్షిస్తారు. అన్ని పవిత్ర గ్రంథాల్లోను క్షమించడం ద్వారా మనిషిలోని పశ్చాత్తాపాన్ని వెలికితీయవచ్చు. మానవ జీవితంలో తప్పులు దొర్లడం అత్యంత సాధారణం. తప్పు చేసేవారు చేసిన తప్పు సరిదిద్దుకొనేందుకు క్షమాపణ ఒక టానిక్‌లా ఉపయోగపడుతుంది. తప్పు చేసిన వ్యక్తిని శిక్షించడం కంటే ఒకసారి హెచ్చరించి క్షమించడం వల్ల ఆ వ్యక్తి ప్రవర్తనలో, విధి నిర్వహణలో మార్పు వచ్చే అవకాశముంది. అలాగే నైపుణ్యమున్న వ్యక్తిత్వం అలవడే అవకాశముంది.
క్షమించే గుణం కలిగి ఉండాలి
ప్రతి మనిషికి క్షమించే గుణం ఉండాలి. సాధారణంగా తప్పు చేసే వ్యక్తి తన తప్పును అంగీకరించే నిజాయితీ కలిగి ఉండాలి. ఎవరైనా వ్యక్తి చేసిన తప్పును క్షమించడం వల్ల ఆ వ్యక్తిలో మార్పు వచ్చే అవ కాశముంది.
- నంబూరి తేజ్‌భరత్, రెవెన్యూ డివిజనల్ అధికారి, పాలకొండ
క్షమా బిక్ష
తప్పు చేసిన ప్రతి వ్యక్తి క్షమాభిక్షకు అర్హుడు. తెలిసి చేసిన తప్పుకు శిక్ష విధించడం, తెలియక చేసిన తప్పును పరిగణనలోనికి తీసుకోకపోవడం ఉత్తమం. మానవ త్వంలో మార్పు వచ్చేందుకే క్షమాపణ.
- మజ్జి చంద్రశేఖర్, పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్, పాలకొండ
‘సారీ’తో సరిపెట్టుకోవద్దు
చేసిన తప్పును రెండక్షరాల ‘సారీ’తో సరిపెట్టుకోవద్దు. తప్పులను పునరావృతం చేసుకోరాదు. ఒక్కసారే క్షమాపణ అడిగే పద్ధతి అలవర్చుకోవాలి.
- వి.వి.గోపాలకృష్ణ,
మండల పరిషత్ అభివృద్ధి అధికారి
క్షమాపణ కోరడం కనీస ధర్మం
తప్పు చేసిన మనిషి తప్పును తెలుసుకున్న తర్వాత క్షమాపణ కోరడం కనీస ధర్మం. తెలియక చేసిన తప్పు గురించి పశ్చాత్తాప పడనవసరం లేదు. తప్పును అంగీకరించడం ద్వారా మనస్సును తేలిక చేసుకోవచ్చు.
- ఐ.వెంకటరావు, ఉపవిద్యాశాఖాధికారి, పాలకొండ