మొదలైన సంక్రాంతి రద్దీ
హైదరాబాద్ : సంక్రాంతి పండుగకు సొంత ఊళ్లకు వెళ్లేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించుకొంటున్న నగర వాసులకు మొదటి రోజే వెయిటింగ్ జాబితా వెక్కిరించింది. సంక్రాంతి కోసం హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు సోమవారం నుంచి రైల్వే రిజర్వేషన్లు ప్రారంభం అయ్యాయి. అయితే, గంటలోనే వెయిటింగ్ జాబితా 300కు చేరుకుంది. కొన్ని రైళ్లలో ఇది 400లకు పెరిగింది.
గోదావరి, విశాఖ, గౌతమి, నారాయణాద్రి, పద్మావతి, వెంకటాద్రి, సింహపురి, ఫలక్నుమా, చెన్నై తదితర ఎక్స్ప్రెస్ రైళ్లలో వెయిటింగ్ జాబితా అనూహ్యంగా పెరిగింది. దీంతో వందలాది మంది ప్రయాణికులు ఉస్సూరుమంటూ వెనుదిగిరారు. ఒకవైపు అయ్యప్ప భక్తులు, మరోవైపు సంక్రాంతి ప్రయాణికులతో సికింద్రాబాద్ రిజర్వేషన్ కార్యాలయం సహా ఇతర రిజర్వేషన్ కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. పండుగలు, తీర్థయాత్రల కోసం ప్రత్యేక రైళ్లు నడిపే దక్షిణ మధ్య రైల్వే ఈసారి వాటిని ప్రకటించకపోవటంతో ప్రయాణికులు నిరాశ నిస్పృహలకు గురి అవుతున్నారు.