43 మంది డీఎస్పీల బదిలీ | Transfer of 43 DSPs in AP | Sakshi
Sakshi News home page

43 మంది డీఎస్పీల బదిలీ

Published Sat, Jun 29 2019 5:10 AM | Last Updated on Sat, Jun 29 2019 5:21 AM

Transfer of 43 DSPs in AP - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 43 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ కార్యాలయం శుక్రవారం రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో పలు డివిజన్‌లలో పనిచేస్తున్న ఎస్‌డీపీవో (డీఎస్పీ)లు, స్పెషల్‌ బ్రాంచ్, ఇంటెలిజెన్స్‌కు చెందిన 30 మందిని పోలీస్‌ హెడ్‌క్వార్టర్‌కు ఎటాచ్‌ చేశారు. మరో ఏడుగురు డీఎస్పీలను ఇంటెలిజెన్స్‌కు బదిలీ చేయగా ఆ స్థానాల్లో ఉన్న ఆరుగురిని పోలీస్‌ హెడ్‌క్వార్టర్‌కు బదిలీ చేశారు. పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు డీఎస్పీల బదిలీలు చేపట్టినట్టు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ శుక్రవారం తెలిపారు. 

ఎన్నికల ముందు బాబు సర్కారు అడ్డగోలు పోస్టింగ్‌లు.. 
సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం సొంత మనుషులకు, సొంత సామాజికవర్గానికి చెందినవారికి సూపర్‌ న్యూమరీ పేరుతో కీలక పోస్టులు కట్టబెట్టింది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడానికి రెండు నెలల ముందే దాదాపు 60 మంది డీఎస్పీ స్థాయి అధికారులను బదిలీ చేసింది. పోలీసుల్లో ఎక్కువ శాతం ఉన్న ఎస్సీ, బీసీ, కాపు, రెడ్డి సామాజికవర్గాలకు చెందినవారికి అప్రధాన (నాన్‌ ఫోకల్‌) పోస్టులు, అతి తక్కువగా ఉన్న చంద్రబాబు సామాజికవర్గం అధికారులకు కీలక పోస్టులు అప్పగించారు. వాస్తవానికి.. సీనియారిటీ ప్రకారం పోస్టులు కేటాయిస్తే అన్ని సామాజికవర్గాలకు అవకాశం వస్తుంది. దీనికి విరుద్ధంగా చంద్రబాబు తన సామాజికవర్గానికి చెందినవారికి మేలు చేకూర్చేలా కొందరు సీఐలకు డీఎస్పీ క్యాడర్‌ ఇస్తూ సూపర్‌ న్యూమరీ అవకాశాన్ని వాడుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సూపర్‌ న్యూమరీ పేరుతో ఫిబ్రవరిలో 18 మందిని డీఎస్పీలుగా అప్‌గ్రేడ్‌ చేసి శాంతిభద్రతలు, ఇంటెలిజెన్స్, స్పెషల్‌ బ్రాంచ్‌ వంటివాటిలో కీలక పోస్టుల్లో నియమించారు. వీరిలో ఏకంగా 14 మంది చంద్రబాబు సామాజికవర్గానికి చెందినవారే కావడం గమనార్హం.  

ఇంటెలిజెన్స్‌కు ఏడుగురు.. 
ఇంటెలిజెన్స్‌ విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టుతోపాటు మరో ఆరు జిల్లాలకు డీఎస్పీలను బదిలీ చేశారు. ఇప్పటివరకు ఆ స్థానాల్లో ఇంటెలిజెన్స్‌ డీఎస్పీలుగా కొనసాగిన ఆరుగురిని పోలీస్‌ హెడ్‌క్వార్టర్‌కు పంపారు. ఎం.భక్తవత్సలం (కర్నూలు), వై.గోవిందరావు (విశాఖ అర్బన్‌ జోన్‌), కె.విజయపౌల్‌ (పశ్చిమ గోదావరి), ఏవీ సుబ్బరాజు (విజయనగరం), ఆర్‌.శ్రీనివాసరావు (గుంటూరు), పి.శ్రీనివాసరావు (విశాఖపట్నం రూరల్‌)లను తదుపరి పోస్టింగ్‌ ఇచ్చే వరకు పోలీస్‌ హెడ్‌క్వార్టర్‌ (డీజీపీ ఆఫీసు)కు రిపోర్టు చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement