అసెంబ్లీలో సీమాంధ్ర నేతలను ఎదుర్కొనే వ్యూహంపై చర్చ!
టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష అత్యవసర సమావేశాన్ని ఆదివారం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణభవన్‌లో మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. మెదక్ జిల్లాలోని తన ఫాంహౌజ్ నుంచి హైదరాబాద్‌లోని నివాసానికి శనివారం సాయంత్రం చేరుకున్న కేసీఆర్, టీఆర్‌ఎస్ నాయకులతో సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, టి.హరీష్‌రావు, కేటీఆర్, ఏనుగు రవీందర్‌రెడ్డి, పార్టీ నేతలు నాయిని నర్సింహారెడ్డి, ఎస్.నిరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ బిల్లును అసెంబ్లీలో చర్చ రాకుండా సీమాంధ్ర నేతలు వేస్తున్న ఎత్తులను చిత్తు చేసే వ్యూహంపై చర్చించడానికి టీఆర్‌ఎస్ శాసనసభాపక్షం సమావేశమవుతోందని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడొకరు వెల్లడించారు.
తెలంగాణ కంటే ప్రాధాన్యాంశమేంది?: కేటీఆర్
తెలంగాణ ఏర్పాటుకంటే ప్రాధాన్యమున్న, తీవ్రమైన అంశం ఏముందని కేటీఆర్ శనివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. అసెంబ్లీ ప్రస్తుత సమావేశాల్లో తెలంగాణపై చర్చ చేపట్టాలని, సోమవారం జరిగే బీఏసీ సమావేశంలో అన్ని పార్టీలు స్పందించాలని డిమాండ్ చేశారు. సీఎం కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇచ్చిన మాటకు కట్టుబడి అసెంబ్లీ వేదికగా తెలంగాణకు సహకరించాలని కోరారు.