
ఉక్రెయిన్‌లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
వైద్య విద్య కోసం ఉక్రెయిన్‌కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు మంగళవారం మృతి చెందారు.
► సముద్రపు అలలకు బలైపోయిన శివకాంత్‌రెడ్డి, అశోక్‌కుమార్
హైదరాబాద్, రైల్వే కోడూరు అర్బన్: వైద్య విద్య కోసం ఉక్రెయిన్‌కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు మంగళవారం మృతి చెందారు. సముద్రంలో మునిగిపోతున్న స్నేహితులను కాపాడడానికి వెళ్లి.. అవే రాకాసి అల లకు బలయ్యారు. మంగళవారం సాయం త్రం 7.30కి జరిగిన ఈ ఘటనలో రంగారెడ్డిజిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కుం ట్లూరుకు చెందిన శివకాంత్‌రెడ్డి, ఏపీ లోని వైఎస్సార్ కడప జిల్లా రైల్వేకోడూరుకు చెంది న మారుకుట్టి అశోక్‌కుమార్ మరణించారు.
వాలీబాల్ ఆడుతూ..
ఉక్రెయిన్‌లోని జిప్రోజియా స్టేట్ హెల్త్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదివేందుకు శివకాంత్‌రెడ్డి, అశోక్‌కుమార్‌లు నాలుగేళ్ల క్రితం వెళ్లారు. వారికి సహచర విద్యార్థులుగా మన దేశానికే చెందిన అభిలాశ్, ముఖేశ్ తోడయ్యారు. ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్న వీరంతా మంగళవారం సాయంత్రం అక్కడి ఓ బీచ్‌కు వెళ్లారు. అక్కడ సరదాగా వాలీబాల్ ఆడుతుండగా.. ముఖేశ్, అభిలాష్‌లు నీటిలోకి దిగారు. కానీ ఒక్కసారిగా వచ్చిన పెద్ద అలలు వారిని సముద్రంలోకి లాక్కెళుతుండడంతో.. కేకలు వేశారు. అది విన్న శివకాంత్‌రెడ్డి, అశోక్‌లు వారిని కాపాడేందుకు నీటిలో కి వెళ్లారు. ఒకరిని ఒడ్డుకు తీసుకువచ్చి వది లేశారు. మరొకరిని ఒడ్డుకు చేర్చే క్రమంలో సముద్రపు అలలు శివకాంత్‌రెడ్డి, అశోక్‌లను లోనికి లాక్కెళ్లాయి. దీంతో అందరూ రక్షించాలంటూ కేకలు వేయడంతో... సమీపంలోనే ఉన్న కొంతమంది వచ్చి నీటిలోంచి బయటికి తీసుకువచ్చారు. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా... అప్పటికే శివకాంత్‌రెడ్డి, అశోక్‌కుమార్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
శోకసంద్రంలో కుటుంబాలు
కుంట్లూరుకు చెందిన పిన్నెంటి జంగారెడ్డి, పద్మల కుమారుడు శివకాంత్‌రెడ్డి. డాక్టరై తిరిగి వస్తాడనుకున్న కుమారుడు మరణించడంతో శివకాంత్‌రెడ్డి కుటుంబం శోక సంద్రం లో మునిగిపోయింది. కాలేజీకి సెలవులు రావడంతో జూన్ 28న ఇంటికి వచ్చిన శివకాంత్‌రెడ్డి ఈ నెల 1న తిరిగి ఉక్రెయిన్‌కు వెళ్లా డు. 20 రోజులు కాకుండానే సముద్రం అలలకు బలయ్యాడు. శివకాంత్‌రెడ్డి మృతదేహం శనివారం స్వదేశానికి రానున్నట్లు బంధువులు తెలిపారు. ఏపీ రైల్వేకోడూరు లోని శ్రీరాంనగర్ వాసి శివాంజనేయులు, నాగమణి కుమారుడు అశోక్‌కుమార్. అశోక్‌తోపాటు అతని సోదరి దివ్యతేజ ఉక్రెయిన్‌లోనే ఎంబీబీఎస్ చదువుతున్నారు. అశోక్ మృతితో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. అతని మృతదేహం త్వరలో స్వస్థలానికి రానున్నట్లు బంధువులు తెలిపారు.