రెండు నెలలకే మాపై విమర్శలా? వైఎస్ జగన్‌పై మంత్రుల వ్యాఖ్యలు
వైఎస్ జగన్‌పై మంత్రుల వ్యాఖ్యలు
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలైనా గడవక ముందే ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తమపై విమర్శలు చేయడం ఏమిటని పలువురు మంత్రులు దుయ్యబట్టారు. జగన్ రుణమాఫీకి వ్యతిరేకి అని, ఆయనకు దీనిపై విమర్శించే హక్కు లేదని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. బుధవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రుణమాఫీ భారం తగ్గించుకోవడం కోసం ఆర్థిక సాయం చేయాలని కేంద్రాన్ని కోరతామని చెప్పారు. రైతు రుణాలను మాఫీ చేస్తున్న తమ ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి దాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, నీటిపారుదల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు.
రుణమాఫీతో రైతులు పండుగ చేసుకుంటున్న తరుణంలో సీఎం దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని జగన్ అనటం పిల్ల చేష్టలని అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు.