
జిల్లాతో ‘ఉదయ్’ బంధం
భద్రాచలం టౌన్/ ఇల్లెందు, న్యూస్‌లైన్: సినీ హీరో ఉదయ్‌కిరణ్ మరణం జిల్లాలోని ఆయన అభిమానులను తీవ్రంగా కలిచివేసింది. హైద్రాబాద్‌లో ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న సినీ హీరో ఉదయ్‌కిరణ్‌కు జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉంది. తన చివరి సినిమా జై శ్రీరామ్ విడుదల సందర్భంగా ఆయన భద్రాద్రి రామున్ని దర్శించుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ కూడా జిల్లాలోని ఇల్లెందుకు చెందిన నటి రేష్మాయే కావడం గమనార్హం. జై శ్రీరామ్ చిత్ర విడుదల సందర్భంగా హీరోయిన్ రేష్మ, ఆ చిత్ర నిర్మాతతో కలిసి ఉదయ్‌కిరణ్ భద్రాద్రి రామున్ని దర్శించుకున్నారు. భద్రాద్రి చూడముచ్చటగా ఉందన్నారు. కష్టపడితే విజయం దక్కుతుందని, అదే ప్రయత్నంలో తొలిసినిమా నుంచి పట్టుదలతో శ్రమిస్తున్నానని తెలిపారు. ఎంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న వర్దమాన హీరో ఉదయ్‌కిరణ్ ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఉదయ్‌కిరణ్‌తో తన నటనా అనుభవాలను హీరోయిన్ రేష్మ ‘న్యూస్‌లైన్’కు వివరించారు.
ఉదయ్ పిరికివాడు కాదు: రేష్మ, ‘జై శ్రీరామ్’ చిత్ర హీరోయిన్
జై శ్రీరామ్’ చిత్రంలో ఉదయ్‌తో నటిం చిన స్మృతులను ఎన్నటికీ మరచిపోలేను. ఆయన మరణం ఓ కలగా ఉంది. ఉదయ్ చాలా ధైర్యంగా ఉండేవారు. తాను నటించిన సినిమాలు ఫెయిల్ అవుతున్నాయనే మనస్తాపంతో చనిపోయేటంతటి పిరికివాడు కాదు. షూటింగ్‌లో తోటి నటీనటులతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. అతనితో నటించిన ‘జై శ్రీరామే’ నా తొలి యాక్షన్ మూవీ. షూటింగ్ సందర్భంలో నా నటనలో లోటుపాట్లను గుర్తించి మెలకువలు చెప్పేవారు. నాకు తెలిసి ఉదయ్ దంపతులు హ్యాపీగా, ఫ్రెండ్లీగా ఉండేవారు. ఆర్థిక ఇబ్బందులు కూడా ఏమీ లేవు. ఉదయ్ చనిపోవడం ఇప్పటికీ కలగా ఉంది. సినీ పరిశ్రమ కూడా నమ్మలేకపోతోంది. త్వరలో మరికొన్ని సినిమాల్లోనూ నటించేం దుకు ఉదయ్ ప్రణాళిక వేసుకున్నారు. షూటింగ్ సమయంలో ఆయన ఎప్పుడూ చిరాకు, విసుగ్గా ఉండేవారు కాదు. చాలా రిలాక్స్‌డ్‌గా ఉండేవారు. ఉదయ్‌కిరణ్‌తో కలిసి నటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా. నాకంటే సీనియర్ అయినప్పటికీ నన్నెప్పుడూ తన జూనియర్‌గా చూడలేదు. ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను.