దామరచర్ల, న్యూస్‌లైన్: సమయం మధ్యాహ్నం కావస్తోంది. హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు వెళుతున్న కారులో నుంచి రోడ్డుపైకి కరెన్సీ నోట్ల కట్టలు విసిరేస్తూ వెళ్లాడు ఓ వ్యక్తి. అప్పుడే అటుగా టీవీఎస్‌పై వెళ్తున్న వ్యక్తికి కొన్ని నోట్ల కట్టలు దొరకగా సమీప గ్రామస్తులకు కొన్ని నోట్లు లభించాయి. అవన్నీ కూడా రూ.500, రూ.1000 నోట్లే. ఈ సంఘటన నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం కొండ్రపోల్ గ్రామ సమీపంలో అద్దంకి- నార్కట్‌పల్లి రహదారిపై మంగళవారం మధ్యాహ్నం జరిగింది.
గ్రామస్తులు తెలిపినవివరాల ప్రకారం..హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు వెళుతున్న కారులోనుంచి ఓ గుర్తు తెలియని వ్యక్తి డబ్బులు (నోట్ల కట్టలు) విసిరేశాడు. అదే సమయంలో రోడ్డు మీద టీవీఎస్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి గమనించి భారీగా కట్టలను తీసికెళ్లినట్లు తెలిసింది. కొండ్రపోల్ గ్రామస్తులకు కొన్ని రూ.500, 1000 నోట్లు దొరికాయి. దొరికిన వారు కొందరు పరారీలో ఉన్నారని సమాచారం. విషయం తెలిసిన వాడపల్లి ఎస్‌ఐ జి.మన్మథ కుమార్ సిబ్బందితో ఆ గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఓ వ్యక్తి నుంచి రూ.500, రూ.1000 నోట్లు తీసుకుని మిర్యాలగూడ బ్యాంకులో పరీక్షించగా అసలువేనని తేలింది. టీవీఎస్‌పై వెళ్లిన వ్యక్తి ఆచూకీ కోసం, డబ్బులు వెదజల్లుతూ వెళ్లిన కారు కోసం దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
నార్కట్‌పల్లి రహదారిపై నోట్ల వర్షం
Published Wed, Aug 28 2013 1:26 AM | Last Updated on Sat, Sep 22 2018 7:51 PM
Advertisement